కొత్త సైనిక నియామక ప్రణాళికపై ఆగ్రహంతో నిరసనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం.. భయకరమైన కార్యాలయాలతో తీవ్రంగా నిరసన చేయడం దేశం మొత్తంగా సంచలనం సృష్టించింది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, యువత ఆందోళనకు దిగుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‌లో జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పలు రైళ్లను తగులబెట్టిన ఆందోళనకారులు, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. 

అయితే ఈ విధ్వంసానికి మూల కారకుడిగా ఏపీలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. సుబ్బారావు.. గుంటూరు నుంచి మొన్న రాత్రి హైదరాబాద్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. విద్యార్థులను రెచ్చగొట్టాడనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయనను ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సుబ్బారావును నరసరావుపేట తరలించి విచారిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ అల్లర్లలో 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆవుల సుబ్బారావుకు సంబంధించిన అకాడెమీకి విద్యార్థులే 450కి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో కరీంనగర్, వరంగల్, మంచిర్యాల తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరి జాబితాను కూడా పోలీసులు సిద్ధం చేశారని సమాచారం.

అసలు ఈ అల్లర్లకు మెయిన్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అలాగే ఎన్ని రోజులు దీని కోసం వ్యూహ రచన జరిగింది? దీని వెనుక ఇంకెవరెవరు ఉన్నారు? ఇంత మంది ఒకే సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవడానికి ఎలా కమ్యూనికేట్ అయ్యారనే అంశంపై సమాధానాలు రాబుతున్నారు.  ఈ మేరకు వాట్సాప్ సంభాషణలను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నే ఎంచుకోవడానికి కారణంగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సుబ్బారావుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్న డిఫెన్స్ అకాడెమీ మూత పడటమే.. ఇంతటి విధ్వంసానికి దారి తీసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల్లో చేస్తున్న జాప్యం.. కరోనా పరిస్థితుల కారణంగా చోటుచేసుకున్న పరిణామాలతో విసుగెత్తిపోయిన సుబ్బారావు నిరుద్యోగ యువతతో కలిసి విధ్వంసానికి తెర తీశారని పోలీసులు భావిస్తున్నారు. కేంద్రంతోనే పోరాడాలని భావించిన ఆయన రాష్ట్రంలోని అతిపెద్ద సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్ ను టార్గెట్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఇలాంటి అంశాలనైతే  అధికారికంగా ధ్రువీకరించలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేసే అవకాశం ఉంది.