ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (ESIC) ఆస్పత్రుల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం సర్వధా కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూపేందర్ వెంటనే కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, రామేశ్వర్ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో 2016 -2017లో ఈ మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన ఎంబీబీఎస్ తొలి బ్యాచ్ డాక్టర్లకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. 

తొలుత భూపేందర్ యాదవ్ మాట్లాుడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఈఎస్ఐసీ ఆస్పత్రుల ఆధునీకరణకు కట్టుబడి ఉందని తెలిపారు. ఇందుకోసమే నగరంలోని ఈఎస్ఐసీ కోసం ప్రత్యేకంగా కొత్త క్యాథ్ ల్యాబ్, న్యూక్లియర్ మెడిసిన్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ఈఎస్ఐసీల డెవలప్ మెంట్ కోసం కేంద్రం ఇప్పటికే తొమ్మిది ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు.  అందులో భాగంగానే హైదరాబాద్ లోని రామచంద్రాపురం, నాచారంలో ఏర్పాటు చేసిన కొత్త ఈఎస్ఐసీలను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. వాటి ఆధునీకరణలోనూ ఎక్కడా రాజీపడేదే లేదన్నారు. 

అలాగే రామగుండం, శంషాబాద్, సంగారెడ్డిలో 100 పడకల ఆస్ప్రతులు నిర్మించేందుకు అనువైన, అవసరమైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్రాన్ని కోరారు. అదేవిధంగా యోగా దినోత్సవం సందర్భంగా 160 ఈఎస్ఐసీ కేంద్రాల్లో మెడికల్ క్యాంప్ లు నిర్వహించనున్నట్టు వెల్లడిచారు. అనంతరం మంత్రి  కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈఎస్ఐసీ ఆస్పత్రి సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం పట్ల అభినందనలు తెలిపారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొవడంలో ఈఎస్ఐసీ సాధారణ ప్రజలకు కూడా సేవలందించిందని కొనియాడారు. స్వస్త్ భారత్ దిశగా వైద్యులందరూ పనిచేయాలని రామేశ్వర్ సూచించారు.