భారత జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు? రేసులో ఉన్నది వీరే?
Who will be India's next T20 captain : టీ20 ప్రపంచ కప్ 2024 ను గెలుచుకున్న తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు? అనే చర్చ మొదలైంది.
Who will be India's next T20 captain : బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోవడానికి మెన్ ఇన్ బ్లూ చివరకు ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్‌లలో నిరాశపరిచిన ప్రదర్శనలను ముగించగలిగారు. తనదైన కెప్టెన్సీతో రోహిత్ శర్మ తన టీమ్ తో కలిసి టైటిల్ ను గెలవడమే కాదు, మొత్తం టోర్నమెంట్‌లో ఒక్క ఓటమి లేకుండా టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
అయితే, టీ20 ప్రపంచ కప్ టైలిల్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాను ఇప్పటి నుంచి వన్డే, టెస్టు క్రికెట్ లో మాత్రమే ఆడతానని చెప్పాడు. భారతదేశం ఫిబ్రవరి 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు రాబోయే నెలల్లో ముఖ్యమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లను ఆడనుంది.
రోహిత్ రిటైర్మెంట్ తీసుకున్నందున టీ20 క్రికెట్‌లో ఈ స్టార్ స్థానాన్ని ఆక్రమించడానికి భారతదేశానికి కొత్త స్టార్ అవసరం. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీ20I క్రికెట్‌లో భారత్‌కు నాయకత్వం వహించేది ఎవరు అనే చర్చ సాగుతోంది. అయితే, రేసులో ప్రధానంగా ముగ్గురు ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి.
హార్దిక్ పాండ్యా
ప్రస్తుతం భారత వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ భారత టీ20 జట్టు కెప్టెన్ రేసులో ముందున్నాడు. రోహిత్ స్థానంలో హార్దిక్ బీసీసీఐకి మొదటి ఎంపిక కావచ్చు. అతను ఇప్పటికే జట్టు వైస్ కెప్టెన్ గా, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా అద్భుతంగా ఆడాడు. బార్బడోస్‌లో భారత్ ట్రోఫీని గెలవడానికి బ్యాట్, బాల్ తో ఈ టోర్నీ మొత్తంగా కీలక భూమిక పోషించాడు.
రిషబ్ పంత్
రిషబ్ పంత్ తన దురదృష్టకర ప్రమాదం తర్వాత ఒక సంవత్సరం పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. అయితే, తిరిగి క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన వికెట్ కీపర్ ఐపీఎల్ ద్వారా అద్భుతమైన ఆరంభంతో తిరిగొచ్చాడు. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ గా కొనసాగుతూ అద్భుతమైన పునరాగమనం చేసాడు. ప్లేయర్ గా, కెప్టెన్ గా అద్భుత ప్రదర్శన కారణంగా అతను తిరిగి మళ్లీ భారత టీ20 జట్టులోకి వచ్చాడు. ప్రపంచ కప్ లోనూ మంచి ప్రదర్శన చేశాడు. కాబట్టి భారత జట్టు తదుపరి కెప్టెన్ రేసులో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా
ప్రపంచ గొప్ప బౌలర్లలలో ఒకరు జస్ప్రీత్ బుమ్రా. ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పే ఈ స్టార్ కూడా టీమిండియా కెప్టెన్ రేసులో ఉన్నాడు. ఐపీఎల్ లో కూడా మంచి ప్రదర్శన చేసిన బుమ్రా.. టీ20 ప్రపంచ కప్ 2024 లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. భారత్ కు అనేక విజయాలు అందించాడు. అయితే, కెప్టెన్ గా పెద్దగా అనుభవం లేకపోవడంతో ఈ రేసులో కాస్త వెనుకబడి ఉన్నాడు కానీ, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.