నన్ను మీ బిడ్డగా భావిస్తేనే నామినేషన్ వేస్తా: నందీగ్రామ్‌లో దీదీ వ్యూహాత్మకం

By Siva KodatiFirst Published Mar 9, 2021, 7:49 PM IST
Highlights

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన ఆమె.. నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన ఆమె.. నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు.

నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న దీదీ రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నందిగ్రామ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం మాట్లాడుతూ.. ప్రజలు తనను వద్దనుకుంటే తాను నామినేషన్‌ వేయనన్నారు.

కానీ, ప్రజలు తమ కుమార్తెగా భావిస్తే నామినేషన్‌ వేసే దిశగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో కాకుండా ఈసారి నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న మమతపై కొందరు బీజేపీ నేతలు బయటి వ్యక్తిగా పేర్కొనడంపై దీదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  బెంగాలీనైన తాను బయటి వ్యక్తినైతే.. ఢిల్లీ నుంచి వచ్చిన మీరేంటని మమత ప్రశ్నించారు.  

మరోవైపు, బెంగాల్‌లో బీజేపీని ఢీకొట్టి హ్యాట్రిక్‌ విజయం సాధించాలన్న కసితో దూసుకెళ్తున్నారు సీఎం మమతా బెనర్జీ. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన దీదీ.. ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చారు.

ఈ నెల 11న మహా శివరాత్రి రోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలున్నాయి. అదే రోజు ఉదయం నందిగ్రామ్‌లో శివరాత్రి పూజల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం కోల్‌కతాకు చేరుకొని కాళీఘాట్‌ రెసిడెన్సీలో మేనిఫెస్టో విడుదల చేస్తారని టీఎంసీ నేతలు భావిస్తున్నారు.

అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా వ్యూహాత్మకంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన దీదీ.. మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు పొందుపరుస్తారోనన్న ఆసక్తి రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.

291మంది అభ్యర్థులతో ఒకేసారి ప్రకటించిన జాబితాలో 114 మంది కొత్త అభ్యర్థులే కావడం విశేషం. ఇందులో 50 మంది మహిళలు, 42 మంది మైనార్టీలకు సీట్లు ఇచ్చారు. అంతేకాకుండా 79 మంది ఎస్సీలు, 17మంది ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు చోటు కల్పించారు.  
 

click me!