
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాషాయ దళం నుంచి ప్రధాని మోడీ, అమిత్ షా, సువేందు అధికారి విమర్శలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా బదులిస్తున్నారు.
ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీపై దీదీ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీకి మరో అర్థం చెప్పారు. భారతీయ జొఘొన్నొ (చెడ్డ) పార్టీ’ అంటూ మమత ఎద్దేవా చేశారు.
నందకుమార్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓటర్లను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ.. తన రాజకీయ జీవితంలో మోడీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో చూడకపోవచ్చని సీఎం వ్యాఖ్యానించారు.
దుర్మార్గులకు, ఉన్మాదులకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ మారిందని, భారతదేశానికి ఇంతకంటే విపత్కర పరిస్థితి ఏముంటుందని మమత అన్నారు. బీజేపీ వాళ్లు చేసే పనులన్నీ చెడ్డవేనని.. ఇలాంటి వాటిని కేవలం వారు మాత్రమే చేయగలరంటూ దీదీ చురకలు వేశారు.
తాను ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యానని.. తన రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రుల్ని చూశానని గుర్తుచేసుకున్నారు. మోడీ క్రూరుడు, కర్కషుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అనేది పూర్తిగా మూర్ఖులు, దుర్మార్గులు, రావణ, దుర్యోదన, దుశ్శాసన, ఉగ్ర మూకలతో నిండిపోయిన పార్టీ అంటూ దీదీ ఆరోపించారు.