తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు, రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కారణంగా మారాయి. గత వారంలో ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఇదే అంశం చుట్టూ చర్చ సాగింది. ఆర్టీసీ సమ్మెపై జేఎసీ నేతలు ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Also readకేసీఆర్ కు జగన్ షాక్: ఆర్టీసీపై మొండిపట్టు, టీపీసీసీ రేసులో రేవంత్
త్వరలోనే మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో కూడ రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలపడాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే పలు పార్టీల నేతలతో బీజేపీ నాయకత్వం టచ్‌లోకి వెళ్లింది.
తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని బీజేపీ చాలా కలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడ రంగంలోకి దిగింది.
బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడ తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ సభ్వత్యాన్ని తీసుకొన్నాడు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను బీజేపీలో చేర్చుకొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెందిన నేతలపై కూడ బీజేపీ కన్నేసింది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు బీజేపీ నేతలు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే గతంలోనే వీరంతా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ, వీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
త్వరలోనే వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకొంటారనే చర్చ సాగుతోంది. మరోవైపు బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొంటారు. సంస్థాగత ఎన్నికలు పూర్తైన తర్వాత ఇతర పార్టీల నుండి వలసలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం బీజేపీ వర్గాల్లో ఉంది.
మహారాష్ట్రలో బీజేపీ రాత్రికి రాత్రే అధికారాన్ని కైవసం చేసుకొంది. అదే తరహాలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కూడ కైవసం చేసుకొంటుందని బీజేపీ నాయకత్వం ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.
భవిష్యత్తులో బీజేపీ తన కార్యాచరణకు సంబంధించిన వ్యూహాన్ని లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరో వైపు వ్యూహాత్మకంగానే లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడ లేకపోలేదు.వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడ దూకుడుగా విమర్శలు చేస్తోంది. కార్యక్రమాలను కూడ నిర్వహిస్తోంది.ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె విషయంలో బీజేపీ కీలకంగా వ్యవహరిస్తోంది.
రూట్ల ప్రైవేటీకరణ కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలోని 5100 రూట్ల ప్రైవేటీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆర్టీసీ జేఎసీ నేతలు సమ్మె చేస్తున్న సమయంలో రూట్లను ప్రైవేటీకరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని 5100 రూట్లను ప్రైవేటీకరిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఎంవీ 1988 చట్టం సెక్షన్ 102 ప్రకారంగా రూట్ల ప్రైవేటీకరణను సమర్ధించింది హైకోర్టు. రాష్ట్రంలోని 5100 రూట్లను ప్రైవేటీకరిస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధించింది.
సమ్మె విషయంలో హైకోర్టు సూచన మేరకు భేషరతుగా తాము విధుల్లో చేరేందుకు సిద్దమేనని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్నికోరారు. కానీ, ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాలేదు. దీంతో సమ్మె యధాతథంగా కొనసాగిస్తామని జేఎసీ ప్రకటించింది. ఆర్టీసీ జేఎసీ నేతలు ఆదివారం నాడు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.
సమ్మెను విరమిస్తామని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినా కూడ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఆర్టీసీని ఇప్పుడున్న స్థితిలో నడపలేమనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.
మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమస్యలను రెండు వారాల్లో పరిష్కరించాలని లేబర్ కోర్టును హైకోర్టు ఆదేశించింది.అయితే ఈ సమస్య రెండు వారాల్లో పరిష్కరమయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడ లేకపోలేదు. ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చించిన జేఎసీ నేతలు భేషరతుగా తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో స్టే కోరుతూ చెన్నమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయించాడు.హోంమంత్రిత్వశాఖ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల పాటు కేసును వాయిదా వేసింది.
కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ ఈ విషయమై చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టులో ఈ ఆదేశాలను అమలు చేయకుండా రమేష్ స్టే తెచ్చుకొన్నాడు. పదేళ్లుగా రమేష్ పౌరసత్వం విషయమై ఆది శ్రీనివాస్ పోరాటం చేస్తున్నాడు.