ఇసుక సంక్షోభంపై పవన్ లాంగ్ మార్చ్: ముప్పేటదాడికి దిగిన వైసీపీ

By Nagaraju penumala  |  First Published Nov 2, 2019, 6:43 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించేందుకు రెడీ అవుతున్నారు. జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానుల అండదండలతో ప్రభుత్వంపై పోరాటానికి దిగుతున్నారు. అందులో భాగంగా ఏపీలో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల కోసం నిరసనకు దిగారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించేందుకు రెడీ అవుతున్నారు. జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానుల అండదండలతో ప్రభుత్వంపై పోరాటానికి దిగుతున్నారు. అందులో భాగంగా ఏపీలో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల కోసం నిరసనకు దిగారు. 

Latest Videos

విశాఖపట్నం వేదికగా ఛలో విశాఖపట్నంకు పిలుపు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇసుక సంక్షోభం అంశాన్ని ఒక అస్త్రంగా చేసుకున్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి శంఖారావం పూరించారు.  

విశాఖలో ఆదివారం తలపెట్టిన లాంగ్ మార్చ్ ను విజయవంతం చేసి జనసేన అంటే ఏంటో నిరూపించాలని పవన్ వ్యూహరచన చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేలా పోరాటం చేసి రాజకీయ ఉనికిని  కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

జనసేన పార్టీ లాంగ్ మార్చ్ కు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో వైసీపీ మాటల యుద్ధానికి దిగింది. పవన్ పై బూతు పురాణం ఇప్పుతోంది. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు అనేక పార్టీలను ఆహ్వానించారు. అయితే టీడీపీ,లోక్ సత్తా మినహా మరే పార్టీ మద్దతు ప్రకటించ లేదు. 

జనసేనకు ఒక్క టీడీపీ మాత్రమే మద్దతు ప్రకటిండంతోపాటు ముగ్గురు మాజీ మంత్రులను లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించడంతో వైసీపీకి ఒక అస్త్రంగా దొరికింది. చంద్రబాబు నాయుడు గతంలో పవన్ చేసిన ఉపకారానికి రుణం తీర్చుకుందామనుకున్నారో లేక తన రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు సంఘీభావం ప్రకటించారో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేసే పరిస్థితికి తీసుకు వచ్చేశారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒక్కరే అంటూ పదేపదే ఆరోపిస్తోంది వైసీపీ. గతంలో తాము ఆరోపిస్తున్నది వాస్తవమేనని ఈ బంధంతో నిరూపితమైందంటూ మంత్రులు పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడికి దిగుతున్నారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడికి దిగారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణాలు ఏమిటో పవన్ కు తెలియడం లేదా అని నిలదీశారు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌కు ఇవేమీ పట్టడం లేదని ఇసుకతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్‌ దీక్ష చేస్తే వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్‌ లాంగ్ మార్చ్ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 
 
పవన్ దీక్షకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో బొగ్గు గనుల్లో తవ్వినట్లు నదిలో అక్రమంగా ఇసుకను తవ్విన విషయాన్ని గుర్తు చేశారు. 

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక అక్రమాలపై వార్తలు రాసిన రిపోర్టర్లపై టీడీపీ నేతలు దాడి దిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు.

అక్రమ ఇసుకను అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిపై మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఎందుకు స్పందించలేదని అప్పుడు ఏమైపోయారని నిలదీశారు కన్నబాబు.  ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించి చంపించారు. మరి అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారు అంటూ ప్రశ్నించారు. 

ఆనాడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ బంధం ఏనాడు విడిపోలేదన్నారు. వారి లాంగ్ జర్నీ కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు. 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు నాయుడు పాలనలో కొన్నికోట్ల మేర ఇసుక దందా నడిచిందని ఆనాడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. 

నవంబర్ 3న పవన్ కళ్యాణ్ చేపట్టబోయే లాంగ్ మార్చ్ పై సెటైర్లు వేశారు. పవన్‌ చేస్తోంది లాంగ్‌ మార్చా?... రాంగ్‌ మార్చా? అంటూ ప్రశ్నించారు. ఉనికి కోసమే పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఏ ప్రభుత్వం అయినా ఇసుకను దోచుకుంటుందా? అయిదేళ్లుగా ఎవరు ఇసుక మాఫియా చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు చంద్రబాబుకు 23 సీట్టిచ్చారని తిట్టిపోశారు. 

ఏ రోజూ చంద్రబాబును పవన్‌ ప్రశ్నించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఆనాడు చంద్రబాబుతో పవన్ కుమ్మక్కు అయ్యారు కాబట్టే నోరు మెదపలేదన్నారు. విశాఖలో ఎందుకు లాంగ్ మార్చ్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాన్ ను నిలదీశారు అనిల్ కుమార్ యాదవ్.  కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డున చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు హితవు పలికారు. 

ఇకపోతే మరోమంత్రి ధర్మాన కృష్ణదాస్ అయితే పవన్ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా విఫలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందని గుర్తు చేశారు. 

ఆనాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెుదపలేదని నిలదీశారు. ఇప్పుడు మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చి నిరసనల పేరుతో రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు . 

ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. పార్టీ అధినేతగా ఆయనకే దిక్కులేనప్పుడు ఏదో పోరాటం చేసేస్తాడంట అంటూ మండిపడ్డారు. 

పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు అధికార దాహం ఎక్కువ అంటూ తిట్టిపోశారు. అందువల్లే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన కుటిల రాజకీయాలను ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు. అందువల్లే 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అయినప్పటికీ నేతల్లో మార్పు రావడం లేదని మండిపడ్డారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. 

మరోవైపు మాజీమంత్రి సి రామచంద్రయ్య సైతం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. దేశచరిత్రలో ఒక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోయిన దాఖలాలు లేవన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన ఘనత దేశ చరిత్రలో పవన్‌కల్యాణ్‌కు మాత్రమే ఉందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తలపెట్టే కార్యక్రమాలను భుజానికెత్తుకునే పవన్‌కు జగన్‌ నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. 

పవన్ కళ్యాణ్ సొంతంగా రాజకీయాలు చేయాలని చంద్రబాబునాయుడు చెప్పినట్లు చేయోద్దంటూ మరోమంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. చంద్రబాబు నాయుడును నమ్ముకుంటే గతంలో నష్టపోయినట్లు మరోసారి కూడా నష్టపోవడం ఖాయమని హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అనిశ్చితి నెలకొంది, మేము పాల్గొనం: పవన్ లాంగ్ మార్చ్ కి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల

ట్రాక్టర్లతో తొక్కించి చంపారు-వనజాక్షిపై దాడి చేశారు: పవన్ పై మంత్రి కన్నబాబు

జనసేన లాంగ్ మార్చ్ కి బాబు టీం రెడీ: పవన్ తో అడుగేయనున్న ముగ్గురు మాజీమంత్రులు

జనసేన లాంగ్ మార్చ్ కి బాబు టీం రెడీ: పవన్ తో అడుగేయనున్న ముగ్గురు మాజీమంత్రులు

click me!