తెలంగాణలోనే కాదు యావత్ దేశంలోనే అత్యంత పెద్దదైన గిరిజన ఉత్సవం మేడారం జాతర మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతుందనగా అపశృతి చోటుచేసుకుంది. జంపన్నవాగులో మునిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
వరంగల్: దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే గిరిజన పండగ మేడారం జాతరలో సర్వ సిద్దమైంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఇప్పటికే తెలంగాణ నుండే కాదు దేశ నలుమూలల నుండి గిరిజనులు మేడారంకు తరలుతున్నారు. అయితే ఈ జాతర ప్రారంభానికి ముందురోజే అపశృతి చోటుచేసుకుంది.
వనదేవతల దర్శనం కోసం మేడారంకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్‌కు చెందిన వినయ్, దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్ లు జంపన్నవాగులో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా మూర్చ వచ్చింది. దీంతో నీటిలో మునిగిపోయి ఇద్దరూ ప్రాణాలను కోల్పోయారు.
ఇలా జాతర ప్రారంభానికి ముందే ఒకేరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో వైద్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. జాతర కోసం వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించే ఏర్పాటు చేస్తున్నారు. ఏమాత్రం అనారోగ్యంగా వున్నా వెంటనే వైద్య శిబిరాలకు చేరుకోవాలని మేడారంకే విచ్చేస్తున్న భక్తులకు సూచిస్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా మేడారం సమ్మక్క సారలమ్మ జారతకు విశిష్ట గుర్తింపు వుంది. అంతేకాకుండా దాదాపు 900ఏళ్ల చరిత్ర ఈ జాతర సొంతం. దీంతో ఈ జాతర సమయంలో జంపన్నవాగులో స్నానం ఆచరించడం, వనదేవతలను దర్శించుకోవడం, నిలువెత్తు బంగారం(బెల్లం)ను అమ్మవార్లకు సమర్పించుకోవడం కోసం భారీగా భక్తులు మేడారంకు చేరుకుంటారు.
రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన ఉత్సవం రేపటినుండి అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలయ్యే ఈ జాతర ఫిబ్రవరి 8న అమ్మవార్ల వన ప్రవేశంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. పిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతామూర్తులు గద్దెల నుండి మళ్లీ వన ప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది.