రెడ్డి, వెలమ బలుపు ఉంటుందని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని ఆయన కోరారు. ఆయన రెడ్డి ఐక్య వేదిక ఆందోళనకు దిగింది.
వరంగల్: వెలమ, రెడ్డి బలుపు వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ వెనక్కి తగ్గారు. తన ప్రసంగాన్ని కొందరు వేరే రకంగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఆయన వివరణ ఇచ్చారు.
తన వ్యాఖ్యలను ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఆయన మంగళవారం కోరారు. "మనిషికి మూడు బలుపులు ఉంటాయి ప్రపంచంలో. ఏం బలుపయా అంటే.. ఒకటి నేను రెడ్డి, నేను వెలమ అనే బలువు. ఒకటి నా దగ్గర బాగా డబ్బుందనే బలువు. నేను బాగా చదువుకున్నాననే బలువు" అంటూ ఆయన కేసముద్రంలో వ్యాఖ్యానించారు.
Also Read: సీఎం కేసీఆర్ కులంలోనే బలుపు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన సందర్భంగా బానోతు శంకర్ నాయక్ ప్రసంగిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. దానిపై తీవ్ర వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కేసముద్రంలో రెడ్డి ఐక్యవేదిక, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.
తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలకైనా దెబ్బ తగిలి ఉంటే క్షమించాలని శంకర్ నాయక్ కోరారు. రెడ్లు, వెలమల సహకారంతోనే తాను ఎమ్మెల్యేను అయ్యానని ఆయన అన్నారు. కావాలనే తన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ బాలానగర్ జోన్ డీసీపీ పద్మజా రెడ్డికి, ఆల్వాల్ పోలీసులకు రెడ్డి జేఏసీ ప్రితనిధులు ఫిర్యాదు చేశారు.