జనగామకు చెందిన కొందరు బీఆర్ఎస్ మహిళా నేతలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డికి రాఖీ కట్టారు. జనగామ నుండి పోటీ చేయాలని కోరారు.
హైదరాబాద్: జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరికి అవకాశం దక్కుతుందోననే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆశావాహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవాళ జనగామకు చెందిన కొందరు మహిళా నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంటికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నెల 21వ తేదీన 115 మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.
undefined
జనగామ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కు చెందిన కొందరు మహిళా నేతలు ఇవాళ హైద్రాబాద్ కు వచ్చి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ మహిళ నేతలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా వడ్డించాడు. వచ్చే ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని స్థానిక నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డిని కోరినట్టుగా సమాచారం.అయితే రాఖీ కట్టేందుకు మహిళా నేతలు వచ్చారని రాజేశ్వర్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు.ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరుతున్నారు.
జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టిక్కెట్టు దక్కకుండా చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయానికి సమీపంలో జనగామకు చెందిన కొందరు నేతలు సమావేశమైన విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే మంత్రి హరీష్ రావును కలిసేందుకు తాము హైద్రాబాద్ కు వచ్చినట్టుగా జనగామ నేతలు చెప్పారు. అయితే మంత్రి వద్దకు తాను తీసుకెళ్లనున్నట్టుగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పినా కూడ స్థానిక నేతలు ఆయన వెంట వెళ్లలేదు.
మరునాడే ముత్తిరెడ్డి యాదగిరికి రెడ్డికి మద్దతుగా ఆయన వర్గీయులు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. జనగామలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నాహలు చేసుకుంటున్నారని ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడ జనగామ అసెంబ్లీ టిక్కెట్టును ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి తమ నేతకు ఈ దఫా టిక్కెట్టు దక్కకుండా ప్లాన్ చేశారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
also read:ముత్తిరెడ్డికే టిక్కెట్టివ్వాలి: జనగామలో అనుచరుల ఆందోళన, ఉద్రిక్తత
ఇదిలా ఉంటే ఇవాళ రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ లోని పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసానికి జనగామకు చెందిన మహిళా నేతలు రావడం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ పరిణామాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయులు ఎలా చూస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.