విశాఖ పట్నంతో పాటు తీరప్రాంతాల్లోని ప్రజలు రానున్న నాలుగురోజుల పాటు జాగ్రత్తగా వుండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో పలు చోట్ల సాదారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న నాలుగురోజులు కోస్తాతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు చలిగాలుల ప్రభావం వుండే అవకాశాలున్నట్లు తెలిపింది.
ఒరిస్సా తీరాన్ని ఆనుకొని అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతం వెంబడి గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో చలి గాలులు, కోస్తా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చలుగాలుల తీవ్రత ఎక్కువగా వుండనుంది కాబట్టి తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో ఇళ్లలోనే వుంటే మంచిదని సూచించారు. అధికారులు కూడా అప్రమత్తంగా వుండాలని సూచించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. విశాఖ ఏజన్సీ ప్రాంతాల్లో అయితే ఉదయం పదింటివరకు మంచు కురుస్తూ సూర్యుడు కనిపించడం లేదు. కోస్తాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి సమయంలో వర్షాలు, చలిగాలులు ఎక్కువ అవుతాయన్న వాతావరణ శాఖ ప్రకటన ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.
ముఖ్యంగా చిన్నారులు, వృద్దులు ఈ చలిగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. చలిగాలులు వీరి ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపించనున్నట్లు... కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.