బంగాళాఖాతంలో ద్రోణి... మరో 24 గంటలు పొంచివున్న వర్షం ముప్పు

By Arun Kumar PFirst Published Jan 2, 2020, 2:16 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా మరో 24 గంటలపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ  కేంద్రం తెలిపింది.

విశాఖపట్నం: బంగాళఖాతంతో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఇరవైగంటల పాటు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరీముఖ్యంగా  కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని... ప్రజలు, అధికారులు అప్రమత్తగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

ఇప్పటికే బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తుండగా ఉత్తర ఒడిశా పరిసరాల్లో ద్రోణి బలహీనపడినా దాని నుంచి కూడా ఉత్తర కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. దీంతో వాతావరణం చల్లబడడమే కాకుండా అక్కడక్కడా వర్షాలు కురిశాయి. 

బుధవారం సాయంత్రం వరకు పరదేశిపాలెం, కాపులుప్పాడలో మూడు, చిలకలూరిపేటలో రెండు, శ్రీకాళహస్తిలో ఒక సెంటీమీటరు వర్షపాతం నమోదైంది.  కళింగపట్నంలో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

తీవ్రమైన తేమగాలులకు వర్షాలు తోడవడంతో చలి ఎక్కువై ప్రజలను గజగజా  వణికిస్తోంది. పదింటివరకు అసలు సూర్యుడి దర్శనమే లభించడం లేదు. ఈ చలిగాలుల వల్ల చిన్నారులు, వృద్దులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తాయని.... జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. 


 

click me!