విశాఖ మెట్రోపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

By Arun Kumar P  |  First Published Dec 30, 2019, 5:01 PM IST

విశాఖ మెట్రోపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రాజధానిని విశాఖకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మెట్రో విషయంలో తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. 


అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్‌ బిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్షియం సింగిల్‌ బిడ్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

నూతన డీపీఆర్‌ సిద్ధం చేసేందుకు కొత్త కన్సల్టెంట్‌కు బాధ్యతలు అప్పగించింది. ఓపెన్‌ టెండర్‌ ద్వారా విశాఖ మెట్రోకు కొత్త టెండర్‌కు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టెండర్ల ప్రక్రియ నిర్వహణకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

Latest Videos

undefined

కాగా ఇన్నాళ్లూ ఆలోచనలు, ప్రతిపాదనలు, డిజైన్లలో మార్పులు, డీపీఆర్‌లో చేర్పులతోనే కాలయాపన జరగడంతో ఒకానొక సమయంలో నగరానికి మెట్రో గగనమే అనే ఆలోచనకి ప్రజలు వచ్చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌లోనే విశాఖ మెట్రో ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకి పునరుజ్జీవం వచ్చింది. 

2015–16 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతల్ని అప్పటి ప్రభుత్వం అప్పగించింది.  మూడు కారిడార్లతో డీపీఆర్‌ని సిద్ధం చేశారు. మొత్తం రూ. 12,500 కోట్లు ప్రాజెక్టుగా డిజైన్‌ చేశారు. 

2016–17లో ఈ ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సొంతంగానే ప్రతి ప్రాజెక్టూ చేపట్టిన నేపథ్యంలో పీపీపీ విధానంలోకి వెళ్లడంతో సదరు కార్పొరేషన్‌ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కి అప్పగించిన విషయం తెలిసిందే.
 

click me!