విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు రివర్స్ టెండరింగ్ నిర్వహించగా ప్రభుత్వ ఖజానాపై మరింత భారం తగ్గిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
విజయవాడ: పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియలో తాజాగా మరో రూ. 30.91 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పటికే పలు ధపాల్లో టిడ్కోలో రివర్స్ టెండరింగ్ చేపట్టి భారీగా ప్రభుత్వ ధనం ఆదా చేసినట్లు మంత్రి తెలిపారు.
విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించామన్నారు.అయితే డిఇసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.275.7 కోట్లకే ఈ పనులను చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ బిడ్ దాఖలు చేసి ఎల్ 1 గా నిలిచిందన్నారు. ఈ ప్యాకేజిలో రూ.30.91 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గిందని మంత్రి వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో టిడ్కోలో కూడా రివర్స్ టెండరింగ్ తో సత్ఫలితాలు సాధించామని మంత్రి బొత్స పేర్కొన్నారు.
read more
ఇంతవరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ. 3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా రూ.2,847.16 కోట్లతో ఆ పనులను చేపట్టడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు. ఇలా 12 ప్యాకేజిల్లో మొత్తం రూ. 392.23 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయ్యిందని ఆయన వివరించారు.
వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 156 నుంచి రూ.316 వరకు ఖర్చు తగ్గి, ప్రభుత్వంపై భారం తగ్గిందని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందచేస్తామని మంత్రి బొత్స ప్రకటించారు.