విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన జగన్... నగరవాసులకు నిరాశ

By Arun Kumar P  |  First Published Dec 28, 2019, 7:26 PM IST

విశాఖపట్నం ఆర్కే బీచ్ లో విశాఖ ఉత్సవ్ వేడుకలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ ముఖ్య  అతిథిగా విచ్చేసి ఉత్సవాలను లాంచనంగా ప్రారంభించారు. 


ఎంతో అట్టహాసంగా ఏర్పాటుచేసిన విశాఖ ఉత్సవ్  వేడుకలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. గన్నవరం నుండి నేరుగా విశాఖకు చేరుకున్న జగన్ కు నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు.  అయితే ఆర్కే బీచ్ కు చేరుకున్న జగన్ కొంతసమయమే అక్కడ గడిపారు. వేడుకలను ప్రారంభించిన అనంతరం కూడా మాట్లాడకుండానే వెనుదిరిగి విశాఖ వాసులను నిరాశపర్చారు. 

రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌)గా విశాఖ నగరం ఉండవచ్చంటూ అసెంబ్లీ వేదికగా పేర్కొన్న ముఖ్యమంత్రి శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ తర్వాత తొలిసారిగా శనివారం మధ్యాహ్నం విశాఖ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు నగర వాసులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. నగరంలో 24 కి.మీ మేర మానవ హారంలా ఏర్పడి ఆయనకు అడుగడుగునా స్వాగతం చెప్పారు. విశాఖ నగర పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం సాయంత్రం రామకృష్ణ బీచ్‌లో విశాఖ ఉత్సవాన్ని ప్రారంభించారు.

Latest Videos

అభివృద్ధి పనులకు శ్రీకారం    

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో పనులకు సంబంధించిన శిలా ఫలకాలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. కైలాసగిరితో పాటు, డాక్టర్‌ వైయస్సార్‌ సెంట్రల్‌ పార్కు వద్ద ఆయన పలు పనులకు శ్రీకారం చుట్టారు. వైయస్సార్‌ సెంట్రల్‌ పార్కులో పుష్ప ప్రదర్శనను, ఆ తర్వాత ఆర్‌కె బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌ను సీఎం ప్రారంభించారు.

అపూర్వ రీతిలో స్వాగతం    

సీఎం విశాఖ నగర పర్యటన సందర్భంగా దాదాపు 24 కిలోమీటర్ల మేర ప్రజలు భారీ మానవహారం నిర్వహించారు. విశాఖ విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ జంక్షన్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, రైల్వేస్టేషన్‌ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేరు, కురుపాం టూంబ్, అప్పూ ఘర్‌ జంక్షన్‌ మీదుగా కైలాసగిరి వరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా మానవహారంలా నిలబడి సీఎంకు కృతజ్ఞతా పూర్వక స్వాగతం పలికారు.

అడుగడుగునా అభిమానం    

దారి పొడవునా అడుగడుగునా అభిమానులు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను  చూసేందుకు ఎగబడ్డారు. ఆయన వాహనంపై పూలు చల్లి తమ అభిమానం చూపారు. పలు చోట్ల రోడ్డు మీదకు దూసుకువచ్చి కారులో ఉన్న సీఎంతో సెల్ఫీ కోసం ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టం మీద వారిని నిలువరించారు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఓపికతో నిలబడి ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడంతో పాటు, గాలిలో బెలూన్లు వదిలి తమ అభిమాన నేతకు స్వాగతం చెప్పారు. ఇంకా పలు చోట్ల వాయిద్యాలు, జానపద నృత్యాలతో సందడి చేశారు. వీటన్నింటి మధ్య సీఎం కాన్వాయి ముందుకు సాగింది.     కైలాసగిరి నుంచి సెంట్రల్‌ పార్క్‌కు, అక్కడి నుంచి ఆర్‌కె బీచ్‌కు సీఎం వచ్చే దారిలో కూడా మానవ తోరణంతో ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఘన స్వాగతం పలికారు. 

కార్నివాల్‌    

విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా నిర్వహించిన కార్నివాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. 4 కి.మీ మేర సాగిన ఈ కార్నివాల్‌లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయ నృత్యాలు, కర్రలపై నడక, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, వివిధ నృత్యాలు నగర వాసులను అమితంగా ఆకట్టుకున్నాయి.

లేజర్‌ షో    

విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం సందర్భంగా ప్రదర్శించిన లేజర్‌షో ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. అంతకు ముందు విశాఖ నగర చరిత్రపై  ప్రదర్శనతో పాటు, నవరత్నాలపై స్లైడ్‌షో కూడా కార్యక్రమంలో ప్రత్యేకంగా నిల్చింది. అన్నింటినీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆసక్తిగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రులు కె.కన్నబాబు, అవంతి శ్రీనివాస్,  బొత్స సత్యనారాయణతో పాటు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు  పాల్గొన్నారు.
 

click me!