Viral Video: ఆడి ఏ4 లగ్జరీ కారులో రైతు.. మార్కెట్‌కు వెళ్లి కూరగాయల విక్రయం.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

By Mahesh KFirst Published Sep 30, 2023, 1:15 PM IST
Highlights

కేరళకు చెందిన సుజీత్ ఎస్పీ వెరైటీ ఫార్మర్‌గా ఇంటర్నెట్ యూజర్లకు సుపరిచితుడు. ఆయన ఇటీవలే పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అయింది. ఆయన పంట పొలం నుంచి పాలకూరను కోసి వాటిని అమ్మడానికి మార్కెట్ వెళ్లడానికి ఆడి ఏ4 లగ్జరీ కారును వినియోగించాడు. ఆ కారులో మార్కెట్ వెళ్లి పాలకూరను అమ్మి మళ్లీ అదే విలాసవంతమైన కారులో ఇంటికి తిరుగుప్రయాణమయ్యాడు.
 

న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ రైతు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సాగులో కొత్త విధానాలు, సాంకేతికతను అమలు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు. ఆయన ఆడి ఏ4 లగ్జరీ కారులో ప్రయాణించి మార్కెట్‌కు వెళ్లి కూరగాయాలు అమ్ముతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆ రైతు సుజీత్ ఎస్పీ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. రూ. 44 లక్షలకు పైగా ధర పలికే ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ కారులో కూరగాయలు అమ్మడానికి వెళ్లుతున్న వీడియో చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. సుజీత్ ఎస్పీని ఇంటర్నెట్‌లో వెరైటీ ఫార్మర్ అని పిలుచుకుంటారు.

‘పాలకూరను అమ్మడానికి ఆడి కారులో ప్రయాణించిన వేళ’ అనే క్యాప్షన్ పెట్టి సుజీత్ ఈ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో సుజీత్ సాగు భూమి వద్ద నుంచి ప్రారంభించి మార్కెట్‌కు వెళ్లేదాకా ఉన్నది. పాలకూరను పంట పొలం నుంచి సేకరించి ఆటోలో లోడ్ చేసి మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఆయన మాత్రం టీషర్ట్, లుంగీ వేషదారణలో ఆడి ఏ4 సెడాన్ కారులో ఎక్కాడు.

కారు మార్కెట్ చేరిన తర్వాత కారులో నుంచి కిందకు దిగి లుంగీ విప్పేశాడు. అప్పటికే ఆయన షార్ట్ ధరించి ఉన్నాడు. టీషర్ట్, షార్ట్ ధరించిన సుజీత్ ఆ లుంగీని కారులో వేసి డోర్ క్లోజ్ చేశాడు. మార్కెట్‌లో ఓ పరదాను కింద పరిచాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఆటోలో నుంచి పంటను తీసి ఆ పరదాలో పరిచాడు. ఆ ఎరుపు పాల కూరను కూడా వినియోగదారులకు అమ్ముతుండటమూ ఆ వీడియోలో కనిపించింది. అమ్మడం అయిపోయాక కారులో నుంచి లుంగీ తీసి నడుముకు కట్టుకున్నాడు. ఫ్యాన్సీ చెప్పులు ధరించి మళ్లీ కారులో దూసుకుపోయాడు.

ఈ వీడియోను కొన్ని రోజుల క్రితమే సుజీత్ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. వెంటనే ఈ వీడియోకు 4.46 లక్షల లైక్‌లు, 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇంటర్నెట్ యూజర్లు ఆయన హార్డ్ వర్క్ పై ప్రశంసలు కురిపించారు. పాలకూర నుంచి ఆడి వరకు గట్టి సంకల్పంతో సాధ్యం అని ఒక యూజర్ పేర్కొన్నాడు. మీరు మంచి రోల్ మాడల్ అని, అంతకు మించి చెప్పడానికి మాటల్లేవని ఇంకో యూజర్ తెలిపాడు. ఇది ప్రేరణ అంటే అని కామెంట్ చేశాడు.

Also Read : భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటో ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అసవరం లేదు : భారత్ - కెనడా వివాదం నేపథ్యంలో జైశంకర్

కేరళకు చెందిన రైతు సుజీత్ ఎస్పీ ఆన్‌లైన్‌లో కొత్త కొత్త సాగు విధానాలపై అవగాహన కల్పిస్తుంటాడు. భిన్నమైన పంటలు సాగు చేయడం, టెక్నాలజీని సాగుతో మిళితం చేయడం వంటి అనేక మార్గాలను వివరిస్తుంటాడు. ఆయనకు ఇన్‌స్టాలో 203000 ఫాలోవర్లు ఉన్నారు.

కొన్ని రిపోర్టుల ప్రకారం సుజీత్ ఎస్పీ ఆడి కారును సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. 

click me!