వార్నీ.. వేస్ట్ అనుకుని అమ్మేస్తే... రూ కోట్లు పలికిన మాస్క్.. చివరికి ఏం చేశారంటే..

By SumaBala Bukka  |  First Published Oct 12, 2023, 2:19 PM IST

ఓ వృద్ధ జంట దగ్గర నుంచి అత్యంత తక్కువ ధరకు ఓ మాస్క్ ను కొనేసిన ఆర్ట్ డీలర్.. ఆ ఆఫ్రికన్ మాస్క్ ను ఆ తర్వాత కోట్ల రూపాయలకు అమ్మేశాడు. ఆ విషయం తెలిసిన ఆ వృద్ధ జంట మోసపోయామని గుర్తించింది. 


ఫ్రాన్స్ : ఎందుకు పనికిరాదనుకుని పారేసే వస్తువులే ఒక్కోసారి కోట్ల విలువ పలుకుతుంటాయి. ఏళ్ల తరబడి కళ్ళముందే కనిపిస్తున్నా వాటి విలువ తెలియదు. ఒక్కోసారి పనికిరాని వస్తువు అనుకుని అమ్మేసిన తర్వాత దాని అసలు ధర తెలిసి షాక్ అవుతుంటారు.  అలాంటి ఓ ఘటన ఫ్రాన్స్ లో వెలుగు చూసింది. ఒక వృద్ధ జంట దగ్గర ఎప్పటినుంచో ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్ ఉంది. అది ఎందుకూ పనికిరాదులే అనుకున్నారు. దాన్ని చాలా తక్కువ ధరకు ఒక ఆర్ట్ డీలర్ కు అమ్మేశారు.

వారి దగ్గర నుంచి అత్యంత తక్కువ ధరకు కొనేసిన ఆర్ట్ డీలర్.. ఆ ఆఫ్రికన్ మాస్క్ ను ఆ తర్వాత కోట్ల రూపాయలకు అమ్మేశాడు. ఆ విషయం తెలిసిన ఆ వృద్ధ జంట మోసపోయామని గుర్తించింది.  వెంటనే నెత్తీనోరూ బాదుకుంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన ఫ్రాన్స్ లోని నిమెస్ లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే…

Latest Videos

undefined

దారుణం : డయాబెటిస్ ఉందని విమానంలోనుంచి దింపేశారు.. ఎక్కడంటే...

81 ఏళ్ల  బామ్మ, 88 ఏళ్ల ఆమె భర్త ఇటీవల ఇల్లు శుభ్రం చేస్తుండగా ఇంట్లో ఎప్పటిదో ఒక పురాతన మాస్క్ కనిపించింది. అది ఎందుకు పనికిరాదని.. పాత సామాన్లతో పాటు దానిని కూడా అమ్ముతూ స్థానికంగా ఉన్న ఒక డీలర్ కు 158 డాలర్లకు అంటే రూ.13వేలకు  అమ్మేశారు. వారి దగ్గర నుంచి ఆ మాస్క్ ను కొన్న ఆర్ట్ డీలర్ ఆ తర్వాత కొద్ది రోజులకు వేలం వేశాడు. ఈ వేలంలో ఆ మాస్క్. రూ. 36 కోట్లకు అమ్ముడుపోయింది. 

ఇది ప్రముఖంగా పేపర్లలో ప్రచురించారు. అది చదివిన వృద్ధ జంట  షాక్ అయ్యారు. తమ దగ్గర అన్ని రోజులు పాత వస్తువుల్లో పడి ఉన్న ఆ మాస్క్ ఎంతో విలువైనదని అప్పుడు వారికి తెలిసింది. దీంతో వెంటనే తామ మోసపోయామని తెలుసుకొని అలేస్ లోని  జ్యుడీషియల్ కోర్టులో కేసు వేశారు. ఆ వస్తువు విలువ గురించి ఉద్దేశపూర్వకంగానే డీలర్ తమకు చెప్పకుండా మోసం చేశాడని… తనకు దాని అసలు విలువ తెలిసి కూడా మౌనంగా ఉండి.. తక్కువ ధరకు కొనుక్కున్నాడని వాదించారు.

అంతేకాదు తమ తోటమాలితో కలిసి పాత వస్తువుల డీలర్ కుట్రపన్నాడని ఆరోపించారు. ఈ మోసానికి నష్టపరిహారంగా తమకు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్ మీద కోర్టులో దావా వేశారు. ఇంతకీ ఆ మాస్క్ ఏమిటంటే ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించి అరుదైన ఫాంగ్ మాస్క్.  ఈ వృద్ధ జంటలోని భర్త తాత ఆఫ్రికాలో 20 శతాబ్ద ప్రారంభంలో  అక్కడి కొలోనియల్ గవర్నర్గా ఉండేవారు. అప్పుడు అతను అక్కడ సేకరించారు ఈ మాస్క్ ను.

దీన్నే వారు కోర్టులో వాదిస్తూ.. ‘ కార్బన్ 14 నిపుణుడి సహాయంతో డీలర్… తన తోటమాలిని ద్వారా కుటుంబ వివరాలు, పూర్వీకుల సమాచారం తెలుసుకొని.. మాస్కును ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. దీనికి ఆ డీలర్ తాను సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనే డీలర్నే కానీ పురాతన వస్తువుల డీలర్ ను కాదని చెప్పుకొచ్చాడు. నిజానికి తాను కొన్నప్పుడు ఆ మాస్కు అసలు విలువ తనకు తెలియదని వాదించాడు.

 అతని వాదన విన్న దిగువ కోర్టు డీలర్ పక్షాన నిలిచింది. అయితే,   వృద్ధ దంపతులు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసి ఈ నవంబర్లో నిమ్స్ లోని హైకోర్టును ఆశ్రయించారు.  వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని దంపతులు ఆరోపించారు. కోర్టుల చుట్టూ తిరగడం వివాదం పెద్దదవుతుండడంతో కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ, దానికి వారి పిల్లలు అంగీకరించకపోవడంతో ఇది ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది.

డీలర్ ఈ మాస్క్ ను కొన్న తర్వాత దాని అసలు విలువను అంచనా కట్టేందుకు డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్  వేలం హౌస్ లను సంప్రదించాడని కోర్టు రికార్డుల్లో నమోదయింది.  వారిని సంప్రదించిన తర్వాతే డీలర్కు ఆ ఆఫ్రికన్ మాస్క్ చాలా గొప్పదని అర్థమయింది. వెంటనే నిపుణులను సంప్రదించాడు.  దీంతో పాటు మాస్ స్పెక్ట్రో మెట్రీ  విశ్లేషణను, రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా మాస్క్ అసలు విలువ తెలుసుకున్నాడు. ఆ తర్వాతే  మాంట్ పెల్లియర్ లో ఎక్కువ ధరకు వేలానికి పెట్టాడు.

ఇక ఈ వేలానికి సంబంధించి మెట్రో న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం..  ఈ మాస్క్  ఆఫ్రికా దేశానికి చెందిన అరుదైన కళాఖండం.  19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్ లోని ఫాంగ్ ప్రజలు ఈ మాస్క్ ను వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయాల్లో ఈ మాస్క్ ను వాడుతారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలో కూడా అరుదైన ఇలాంటి మాస్కులు చాలా తక్కువగా కనిపిస్తాయి. 

click me!