ఆ కుటుంబాల కోసమే రాజధానిపై వైసిపి సర్కార్...: వడ్డే శోభనాద్రీశ్వరరావు

By Arun Kumar PFirst Published Feb 26, 2020, 3:25 PM IST
Highlights

అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలో  మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి సర్కార్ పై విరుచుకుపడ్డారు. 

విజయవాడ: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఏర్పడిన అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలోని ఆటోనగర్‌లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, సీపీఐ నేత రామకృష్ణ, జనసేన నేత బత్తిన రాము తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ... అమరావతి కేవలం రాజధాని గ్రామాల సమస్య కాదు 5 కోట్ల ఆంధ్రుల సమస్య  అని అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. 

read more  వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో విచారణ... ప్రభుత్వానికి ఆదేశాలు

కేవలం కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి వచ్చిందన్నారు. ఇది జాతీయ సమస్యగా పరిణమించబోతోందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. 

రాజధాని కోసం చేస్తున్న ఉద్యమంలో నూటికి నూరుశాతం విజయం సాధించి తీరుతామని... పోలీసులు, ప్రభుత్వ బెదిరింపులకు అమరావతి  ప్రాంత ప్రజలు భయపడే రకం కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం మారేవరకు పోరాటం చేస్తామని శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. 

ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ... రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. పోలీసులపైకి నెపం నెట్టి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని... కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఇలాంటి దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదన్నారు. 

read more  బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది: విజయసాయి

‘‘రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని బిజెపి ఎంపీ జీవీఎల్‌ చెబుతున్నారు. ఇందులో రాష్ట్రానికి ఎంత సంబంధం ఉందో... కేంద్రానికి కూడా అంతే బాధ్యత ఉంది. రాజధానిపై జీవీఎల్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలి’’ అని కేశినేని కోరారు. 

అమరావతి పరిరక్షణ సమితి ఐకాస అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ...వైసిపి ప్రభుత్వం రెండు నెలలుగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని విమర్శించారు. తమ ప్రాంత ప్రయోజనాల కోసం నిరసన తెలిపే వారిని గూండాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
   

click me!