చెత్త నిర్ణయాలతో మీ ఇద్దరే మిగులుతారు: జగన్, విజయసాయిపై బుద్ధా వెంకన్న ఫైర్

By sivanagaprasad KodatiFirst Published Nov 17, 2019, 5:54 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీట్టర్ సాక్షిగా మండిపడ్డారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీట్టర్ సాక్షిగా మండిపడ్డారు. 151మంది ఎమ్మెల్యేలు గెలిచిన తరువాత కూడా అభద్రతాభావంతో మా పార్టీ ఎమ్మెల్యేలను వైకాపాలో చేర్చుకుంటున్నాడు మీ తింగరి మాలోకం. ఎందుకు అంత భయం? చెత్త నిర్ణయాల కారణంగా మీరు, మీ తింగరి మాలోకం మాత్రమే పార్టీలో మిగులుతారు అనే భయమా విజయసాయి రెడ్డిగారు?

మీ పార్టీలో చేరిన నాయకుడి సవాల్ కి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు?సమాధానం మేము చెప్పడానికి సిద్ధం కానీ ఒక చిన్న కండిషన్. అదే నాయకుడు అన్నం తినేవాడు వైకాపాలో చేరడు అని అన్నారు. మరి మీరు అన్నం బదులు వేరేది తింటున్నా అని ప్రకటిస్తే మేము సమాధానం చెప్పడానికి సిద్ధం’’ అంటూ సవాల్ విసిరారు. 

కాగా యనమలపై మంత్రి కొడాలి నాని అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఓ ఘాటు లేక సంధించారు బుద్ధా. అత్యధిక శాతం బీసీలు గౌరవించే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని మంత్రి కొడాలి నాని హీనమైన భాషతో తీవ్రంగా అవమానపరిచారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశాలతో కొడాలి నాని ఈ హీనమైన భాష వాడారని, అలా చేయలేదని నిరూపించుకోవాలంటే మంత్రివర్గం నుంచి అతనిని భర్తరఫ్‌ చేయాలి లేదా బీసీలకు క్షమాపణలు చెప్పించాలని అన్నారు. 

Also read:వైఎస్ జగన్ కొడాలి నానితో తిట్టించారు: బుద్ధా వెంకన్న

"ఇవి చేయించకపోతే తనమంత్రి చేత ముఖ్యమంత్రే యనమల రామకృష్ణుడిని తిట్టించారని బీసీలు భావించవలసి ఉంటుంది. బీసీలను వైసీపీ ఎందుకంత చులకనగా చూస్తున్నది. బీసీలపై ఎందుకు దాడులు చేస్తున్నది?" బుద్ధా వెంకన్న అన్నారు.

"రాష్ట్రంలో నేడు ఇసుక ధరలు పెరిగాయి. సిమెంట్‌ ధరలు పెంచారు. దీంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. 50 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే మాతృభాషను నాశనం చేస్తున్న జగన్‌ విధానాలపై ఆందోళన పెరుగుతున్నది" అని అన్నారు. 

"మీడియా స్వేచ్ఛను హరిస్తూ నల్ల జీవో 2430పై రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకత పెరుగుతున్నది. మద్యం రేట్లు పెంచి ప్రజల ఇంటి ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేశారు. సింగపూర్‌ అంకుర పరిశ్రమ ప్రాజెక్టు వెళ్లిపోయింది" అని అన్నారు. 

"రిలయన్స్‌, అదాని, బీఆర్‌ శెట్టి పరిశ్రమలు, పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా ఇసుకపై ప్రజల్లో వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు మంత్రులచేత దుర్భాషలాడిస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇసుక దీక్ష రోజే ఫిరాయింపు చేయించి భవన నిర్మాణ కార్మికుల బాధలు లోకానికి తెలియకుండా బ్లాక్‌ చేసే కుట్ర చేస్తున్నారు" అని బుద్ధా వెంకన్న అన్నారు.

"జగన్మోహన్‌రెడ్డి లక్ష కోట్లు దోచుకోవడానికి తన తండ్రికి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే కారణం. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ లక్ష కోట్లు దోచుకుని ఆ కాంగ్రెస్‌కే వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి ముఖ్యమంత్రి మంత్రివర్గంలో ఉన్న కొడాలి నాని చంద్రబాబుగారిపై హీనమైన విమర్శలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారిపై హీనమైన భాష ప్రయోగించడం దారుణం" అని అన్నారు.

Also read:ఆ కథేంటో తేల్చుకుందాం రండి: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్

"లోకేశ్‌బాబు సామర్థ్యం లేనివారైతే వైసీపీ మంత్రులు, వారి మీడియా రోజూ లోకేష్‌ భజన ఎందుకు చేస్తున్నారు? లోకేష్‌ సామర్థ్యం చూసి వైసీపీకి భయం కలిగే, రోజూ వారిపై హీనంగా మాట్లాడుతున్నారు. పంచాయతీరాజ్‌ మంత్రిగా లోకేష్‌ గ్రామాల్ని తక్కువ కాలంలోనే ఎప్పుడూ చేయనంతటి అభివృద్ధిని ప్రజలు చూశారు" అని అన్నారు. 

"రాజధానికి కులం అంటగట్టారు ఒక మంత్రి. కలాలకు కులాన్ని అంటగట్టారు మరో మంత్రి. డీఎస్పీ ప్రమోషన్లలో 39 మందిలో 35 మంది చంద్రబాబు సామాజిక వర్గమని జగన్‌ అబద్ధాలు చెప్పి కులతత్వాన్ని రెచ్చగొట్టారు" అని గుర్తు చేశారు. "39 మందిలో ముగ్గురు మాత్రమే చంద్రబాబు సామాజిక వర్గం అనేది వాస్తవం. కౌలు రైతుల రైతు భరోసాలో కులతత్వం రెచ్చగొట్టారు. ఇంగ్లీష్‌ భాష పేరుతో కులతత్వాన్ని రెచ్చగొడుతున్నారు" అని అన్నారు. 

"పరిపాలనలో ఘోర వైఫల్యం చెంది ప్రజల వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రి తన అనుచరుల చేత కులతత్వాన్ని రెచ్చగొట్టిస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. తిట్ల రాజకీయానికి దిగజారారు" అని అన్నారు. 

"దొంగే దొంగ దొంగ అని అరచినట్లుగా వారి లక్షణాలు, కుట్రలు తెలుగుదేశానికి అంటగడితే ప్రజలు ఇంకా నమ్ముతారని భ్రమపడుతున్నారు. ఒకసారి నమ్మి మోసపోయారు. మరోసారి నమ్మి మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు" అని బుద్ధా వెంకన్న అన్నారు.

click me!