తునిలో జర్నలిస్ట్ హత్య... మాజీ హోంమంత్రి చినరాజప్ప ఏమన్నారంటే

By Arun Kumar PFirst Published Oct 16, 2019, 4:52 PM IST
Highlights

తునిలో ఓ మీడియాసంస్ధలో పనిచేస్తున్న విలేకరిని కొందరు గుర్తుతెలియని దుండగులు హతమార్చిన విషయం తెలసిందే. ఈ దారుణంపై తాజాగా మాజీ హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు.  

తూర్పుగోదావరి: తునిలో మంగళవారం సాయంత్రం జరిగిన జర్నలిస్ట్ హత్యను మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందుతులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరక్కుండా శాంతిభద్రతలను కాపాడాలంటూ ప్రభుత్వానికి సూచించారు. 

ఓ మీడియా సంస్ధలో పనిచేసే విలేకరి కాతా సత్యనారాయణ దారుణ హత్య అమానుషమని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులుపై దాడులు చేసి హత్యలు చేయటం దారుణమన్నారు. 

సత్యనారాయణ ను హత్యచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా దిగజారిపోయాయో తెలుస్తోందని పేర్కొన్నారు. 
పాత్రికేయుల భద్రత కల్పించి,ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని అన్నారు.

మృతుడు సత్యనారాయణ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ నయిం హస్మీ తో చర్చించినట్లు...నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరినట్లు చినరాజప్ప వెల్లడించారు. 

తుని మండలం ఎస్ అన్నవరంలో  కొందరు దుండగులు సత్యనారాయణను అతికిరాతకంగా నరికిచంపారు. నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా నరికి సంఘటనా  స్థలం నుండి పరారయ్యారు. ఈ దారుణం జిల్లాలో సంచలనంగా మారింది. 

తొండంగి అర్భన్ రిపోర్టర్ కాతా సత్యనారాయణను సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో అతన్ని ముట్టడించిన దుండగులు అందరూ చూస్తుండగానే దారుణంగా నరికిచంపారు. కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి ప్రాణాలు కోల్పోయేవరకు  దాడి చేశారు.

అతడు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసున్నట్లు సమాచారం. అతడి ఇంటికి సమీపంలోని ఆలయంవద్ద కాపుకాసిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి మృతదేహంతో పాటు రోడ్డుపై కూడా రక్తం పారింది. ఈ హత్యపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.   

 

click me!