వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇందుకు తగ్గట్లుగా గతంలోనే తాము అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అమరావతి:
అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నది తెలుగు దేశం పార్టీ ప్రధాన లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుపేదల ఆకలి భాదను గుర్తించి వారు గౌరవప్రదంగా కడుపు నింపుకునేలా చేసిన ఘనత గతంలో తాము పాలించిన ప్రభుత్వాలకే దక్కుతుందన్నారు.
''అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నది తెదేపా ప్రధాన లక్ష్యం. అప్పటి ఎన్టీఆర్ కిలో రూ.2 బియ్యం పథకం నుండి నిన్నటి అన్న క్యాంటీన్ వరకు అన్న అమృతహస్తం, బాలామృతం, గిరి గోరుముద్దలు, ఆహారబుట్ట, రంజాన్ తోఫా... వంటి తెదేపా పథకాలన్నీ ఈ లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయి.
అలాంటిది పేదలను విస్మరించి, కేవలం తెదేపా పథకాలన్న కారణంగా వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ రద్దు చేసింది. ఈరోజు ప్రపంచం ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి, అన్న క్యాంటీన్ వంటి పథకాలను పునరుద్ధరించాలి. పేదలకు ఆహారభద్రత కల్పించాలి.'' అంటూ చంద్రబాబు వరల్డ్ ఫుడ్ డే యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.