జగన్ ప్రభుత్వ నిర్ణయం... తెలుగు జాతికే పొంచివున్న ప్రమాదం...: టిడిపి ఎమ్మెల్సీ

By Arun Kumar PFirst Published Nov 8, 2019, 4:00 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న అనాలోచిన నిర్ణయాల వల్ల ఏకంగా తెలుగు జాతి ఉనికే ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయని టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.  

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే చివరకు ఆరునెలల్లో తెలుగుజాతి ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తలెత్తాయని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు. తెలుగు బాష ప్రాధాన్యతను తగ్గిస్తూ సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష బోధనకు అనుమతులివ్వడమే అందుకు నిదర్శనమని ఆయన ఆక్షేపించారు. 

శుక్రవారం ఆయన గుంటూరులోని పార్టీరాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో 1నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంవల్ల తెలుగుభాష ఉనికే ప్రశ్నార్థం కానుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల అభీష్టంమేరకే నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం, చెప్పడం సరికాదన్నారు. 

గత ప్రభుత్వం మున్సిపల్‌ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విధానాన్ని తీసుకురావాలని చూసినప్పుడు ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా రాష్ట్రమంతా ఆంగ్లభాషాబోధనను ఎలా అనుమతిస్తుందని డొక్కా ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వ నూతన విద్యావిధానాన్నిపరిశీలించకుండా, , కస్తూరిరంగన్‌ నివేదిక విధివిధానాలు అమలు దశలో ఉండగానే ఆ నివేదికను స్టడీచేయకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని అన్నారు. 

read more  ఏపి సీఎం జగన్ ఓ పిచ్చోడు...అందుకు నిదర్శనాలివే...: బుద్దా వెంకన్న

అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలతో సంప్రదించకుండా తెలుగుభాషపై కత్తికట్టడం ఎంతవరకు భావ్యమని ఎమ్మెల్సీ నిలదీశారు. తెలుగురాష్ట్రాన్ని ఆంగ్లాంధ్రప్రదేశ్‌గా మారిపోతే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మనుగడ ఏమిటో ఆలోచన చేయాలన్నారు. 

తెలుగుదేశంపార్టీ ఆంగ్లభాషకు వ్యతిరేకం కానేకాదన్న డొక్కా తెలుగుని నిర్వీర్యంచేసే చర్యలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించబోమన్నారు. తెలుగు బతకాలంటే... తెలుగువారి గొప్పతనం ప్రపంచానికి తెలియాలన్నా భాష మనుగడలో ఉండటం చాలా అవసరమని డొక్కా స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకదేశాల్లో, పొరుగురాష్ట్రాల్లో తెలుగుభాషను ఆదరిస్తున్న క్రమంలో సొంతరాష్ట్రంలోనే తెలుగుభాషకు ముప్పువాటిల్లే పరిస్థితిని ప్రభుత్వం తీసుకురావడం భావ్యంకాదన్నారు. 

భవిష్యత్‌ గురించి ఆలోచన చేయకుండా తెలుగువారి అస్తిత్వమే కనుమరుగయ్యేలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి మంచిదికాదని మాణిక్యవరప్రసాద్‌ హితవు పలికారు.  ప్రభుత్వ నిర్ణయం వల్ల మనజాతిని మనమే నాశనం చేసుకునే దుస్థితి రానుందన్నారు. ఇతరభాషల్లో ప్రావీణ్యం సంపాదించడం అదనపు అర్హతేగానీ, మాతృభాషలో ఉండే గొప్పతనం, తియ్యదనం, భావవ్యక్తీకరణ ఇతర భాషలద్వారా రాదని స్పష్టంచేశారు.  

గ్రామీణ విద్యార్థులు ఒక్కసారిగా ఆంగ్లంలోకి రావాలంటే ఎలా సాధ్యమవుతుందన్నారు.  తెలుగుబోధనకు, ఆంగ్లబోధనకు విడివిడిగా డీఎస్సీలు నిర్వహించాలని, ఉపాధ్యాయులకు కొంతవ్యవధి, శిక్షణ ఇవ్వాలని డొక్కా సూచించారు. ప్రభుత్వం తక్షణమే మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థిసంఘాలతో సంప్రదింపులు జరిపి, నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

read more  కేంద్ర మంత్రితో సీఎం జగన్ భేటీ.... కడప స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం

అన్ని ప్రభుత్వపాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అనివార్యం చేశాక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారభాషా సంఘాలు, తెలుగు అకాడమీలు ఎందుకని మాజీమంత్రి ప్రశ్నించారు. తెలుగువారి ఉనికికే ప్రమాదకరమైన ఈ నిర్ణయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలవేళ  మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలన్న ఆయన సూచనను పాలకులు పెడచెవినపెట్టడం బాధాకరమన్నారు. 

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మాతృభాషను ప్రోత్సహించాలని సూచించారన్నారు. తెలుగుని బతికించి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత  ప్రభుత్వంపైనే ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21కోట్లమంది తెలుగువారికి అన్యాయం చేయవద్దని డొక్కా అభ్యర్థించారు.

తమ్మినేని బహిరంగక్షమాపణ చెప్పాలి

స్పీకర్‌హోదాలో ఉన్న తమ్మినేని సీతారామ్‌ ఉపయోగించిన భాష తీవ్రఅభ్యంతరకరమని, స్పీకర్‌స్థానాన్ని దిగజార్చేలా ఆయన ప్రవర్తించకూడదన్నారు. రాజ్యాంగం స్పీకర్‌ స్థానానికి అత్యున్నత గౌరవమిచ్చిందని, అనంతశయనం అయ్యంగార్‌, తొలిస్పీకర్‌ మౌలాంకర్‌ వంటివారు ఆ స్థానానికి ఎంతటివన్నె, గౌరవం తీసుకొచ్చారో తమ్మినేని తెలుసుకోవాలన్నారు.  

స్పీకర్‌గా ఉన్నవ్యక్తి బహిరగసభల్లో ఇష్టానుసారం మాట్లాడటం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్పీకర్ల వ్యవహారశైలికి సంబంధించిన విధివిధానాలకు ప్రామాణికమైన కౌల్‌ అండ్‌ షక్దర్‌ విధానాలను, రాజ్యాంగ విలువలకు, స్పీకర్‌ స్థానానికి తగింది కాదని డొక్కా సూచించారు. విలువలకు ప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి, పార్టీలతరుపున ఇష్టానుసారం మాట్లాడినందుకు, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.      
 
 

click me!