ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాా వైరస్ ప్రభావం విజయవాడ ఇంద్రకీలాద్రికి తాకింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అమ్మవారి అంతరాలయ దర్శనాలతో పాటే సేవలన్నింటిని రద్దు చేశాయి.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో మార్చి 31 వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అన్నిసేవలు నిలిపివేస్తున్నట్లు ఛైర్మన్ పైలా సోమినాయుడు వెల్లడించారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేయడమే కాకుండా అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి పైకి భక్తులను తరలించే బస్సులు, లిఫ్టులను నిలిపివేసినట్లు తెలిపారు. అలాగే కేశఖండనశాలను కూడా మూసివేసినట్లు వెల్లడించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అందచేస్తున్నట్లు తెలిపారు. భక్తులు అందరిని చెక్ చేసిన తరువాతే దర్శనానికి అనుమతిస్తున్నామని అన్నారు.
undefined
read more శ్రీ వెంకటేశ్వరుని తాకిన కరోనా: తిరుమల ఆలయం మూసివేత
దేశప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపిస్తున్నట్లు ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. ఉగాది రోజు పంచాగశ్రవణం, అమ్మవారి సేవలకు ఎవరికి అనుమతి లేదన్నారు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయని... భక్తులు ఎవరైనా ముందుగా సేవలను బుక్ చేసుకుని ఉంటే వారి పేరున సేవలు నిర్వహిస్తాము లేదా డబ్బులు వెనక్కి చెల్లిస్తామన్నారు.
ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆలయ పరిసరాలను శుభ్రపరుస్తున్నామని అన్నారు. మహామండపం నుంచి మెట్ల మార్గం, ఘట్ రోడ్జు మార్గాలలోనే భక్తుల అనుమతిస్తున్నామని అన్నారు. చిన్నపిల్లలు , వృద్దులు , గర్బిణీలు దర్శనానికి రాకపోవడమే మంచిదని సూచించారు. అమ్మవారి ప్రసాదం పొంగలి, కదబం, దద్దోజనం వంటి ప్రసాదాలు ప్యాకెట్లరూపంలో ఎప్పటిలాగే అందిస్తున్నామన్నారు.