Oct 11, 2022, 5:16 PM IST
పెద్దపల్లి : తెలంగాణ వున్నట్లు అద్భుతమైన పోలీస్ వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ గా పనిచేస్తున్నారని... అందువల్లే రాష్ట్రంలో నేరాల శాతం తగ్గి ప్రశాంతంగా వుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వచ్చాయన్నారు. త్వరలోనే గోదావరిఖనిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. పెద్దపల్లి జల్లా గోదావరిఖనిలో నూతనంగా నిర్మించిన వన్ టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్, పోలీస్ గెస్ట్ హౌస్ ను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీటి నిర్మాణానికి తమవంతు సహకారం అందించిన సింగరేణి, ఎన్టిపిసి యాజమాన్యాలకు మంత్రి మహమూద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు.