Mar 17, 2023, 12:15 PM IST
హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర నష్టాలపాలయ్యారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నిన్న(గురువారం) కురిసిన వడగండ్ల వాన తీవ్ర పంటనష్టాన్ని సృష్టించింది. ఆకాశం నుండి చిన్న గులకరాళ్ల మాదిరిగా రైతుల పంటలపైకి దూసుకొచ్చిన వడగండ్లు చేతికందివచ్చిన పంటలను నేలపాలు చేసాయి. ఇలా అకాల వర్షం, వడగండ్లతో దెబ్బతిన్న పంటలను నేడు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించనున్నారు. మంత్రులిద్దరితో పాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందర్ రావు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో వికారాబాద్ పర్యటనకు బయలుదేరారు. అకాల వర్షాలతో చోటుచేసుకున్న పంటనష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకోనుంది.