అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం అభ్యంతరకరం, విడ్డూరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఐదేళ్ల పాలన అరాచక, అప్రజాస్వామిక, దౌర్జన్యపూరిత, రాక్షస పాలన. ముద్దాయి వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్ పడుతున్న తపన, చూపిస్తున్న ప్రేమ వెనుక మతలబేంటో? అర్థం కావడంలేదన్నారు. వంశీ అన్నెం, పున్నెం ఎరగడు, నిజాయితీపరుడు, సచ్చీలుడు, చీమకుకూడా హాని తలపెట్టడు, పరస్త్రీలను, దళితులను గౌరవిస్తాడు, భూ కబ్జాలు చేయడు, దొంగ పట్టాలు సృష్టించడు, పట్టిసీమ మట్టి కొట్టేయడు, దళితులను హింసించడు, అత్యంత నిజాయితీపరుడు అనే భావన జగన్ లో ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. పట్టిసీమ గట్టు మట్టిని కొల్లగొట్టిన వంశీని పరామర్శించేందుకు వెళ్లడానికి ఎవరైనా ఆలోచించాలన్నారు. జగన్ పట్ల దళితులు ఆగ్రహావేశాలతో ఉన్నారనే విషయం జగన్ మరచిపోరాదని హితవు పలికారు. పులివెందులకు చెందిన నాగమ్మ అనే దళితురాలు అత్యాచారానికి గురైతే పరామర్శకు వెళ్లని జగన్.. వంశీని పరామర్శించడానికి వెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు.