Longest Train: ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు గురించి విన్నారా? ఈ రైలు 9 రాష్ట్రాల మీదుగా మొత్తం 4,189 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ రైలు పేరు, ఏఏ రాష్ట్రాల్లో సేవలందిస్తుంది? ఏఏ స్టేషన్లలో ఆగుతుంది ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం రండి.
ఇండియాలో ప్రతి రోజు రైళ్లలో లక్షల మంది ప్రయాణిస్తారు. అది కూడా పండుగలప్పుడు, సెలవుల్లో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. రైలు రవాణా దేశానికి వెన్నెముకలా పనిచేస్తుంది. దీని నుంచి రోజూ రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. ఇంత పెద్ద నెట్వర్క్ లో ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్ గురించి తెలుసుకుందాం.
అస్సాం రాష్ట్రం దిబ్రూగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ (Vivek Express) ఇండియాలో ఎక్కువ దూరం వెళ్లే రైలు. దీన్ని లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రైన్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. వివేక్ ఎక్స్‌ప్రెస్ మొదటి సర్వీస్ నవంబర్ 19, 2011న మొదలైంది. అప్పట్లో వారానికి 2 రోజులు నడిపేవారు. ఆ తర్వాత ఈ రైలుని వారానికి 4 రోజులు తిప్పేవారు. ఇప్పుడు డైలీ నడుపుతున్నారు.
దిబ్రూగర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్(kanyakumari to dibrugarh Vivek Express) మొత్తం 4,189 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాం నుండి తమిళనాడు వరకు తొమ్మిది రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మొత్తం 4,189 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. దిబ్రూగర్ నుంచి కన్యాకుమారి వెళ్లడానికి 74 గంటలు పడుతుంది. అదే తిరిగి కన్యాకుమారి నుంచి దిబ్రూగర్ చేరుకోవడానికి 75:25 గంటలు సమయం పడుతుంది.
ఈ రైలు ప్రస్తుతం దూరం, టైమ్ రెండింటిలోనూ దేశంలోనే అతి పొడవైన రైలు మార్గంగా రికార్డుల్లో నిలిచింది. దిబ్రూగర్-కన్యాకుమారి-దిబ్రూగర్ వివేక్ ఎక్స్‌ప్రెస్ 22 బోగీలను కలిగి ఉంది. ఇందులో 1 ఏసీ టూ టైర్, 4 ఏసీ త్రీ టైర్, 11 స్లీపర్ క్లాస్, 3 జనరల్ బోగీలు, 1 ప్యాంట్రీ కార్, 2 పవర్ కమ్ లగేజ్ రేకులు ఉన్నాయి. దిబ్రూగర్ నుండి కన్యాకుమారికి ఏసీ టూ టైర్‌లో ప్రయాణించే ప్రయాణికులు ఒక్కొక్కరు రూ.4,450 చెల్లించాలి. ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే వారు వరుసగా రూ.3,015, రూ.1,185 చెల్లించాలి.
వివేక్ ఎక్స్‌ప్రెస్ న్యూ టిన్సుకియా జంక్షన్, నహర్‌కటియా, సిమాలూగురి జంక్షన్, మరియాని జంక్షన్, ఫర్కేటింగ్ జంక్షన్, దిమాపూర్, దిపు, లుమ్డింగ్ జంక్షన్, హోజాయ్, జాగి రోడ్, గౌహతి, గోల్‌పారా టౌన్, న్యూ బొంగైగావ్, కోక్రజార్, న్యూ అలీపుర్‌దువార్, న్యూ కూచ్ బెహార్, జల్పాయిగురి రోడ్, మాల్డా టౌన్, రాంపూర్ హాట్, బర్ధమాన్ జంక్షన్, డాంకుని, ఖరగ్‌పూర్ జంక్షన్, బలేశ్వర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్ జంక్షన్, బ్రహ్మపూర్ స్టేషన్లలో ఆగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్రంలో పలాస, శ్రీకాకుళం రోడ్, విశాఖపట్నం, దువ్వాడ, సామల్‌కోట్ జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్లలో ఆగుతుంది.
ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కాట్పాడి జంక్షన్, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్లలో ఆ తర్వాత కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జంక్షన్, త్రిసూర్, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనూర్, కొల్లాం జంక్షన్, తిరువనంతపురం సెంట్రల్ చివరిగా తమిళనాడులోని నాగర్‌కోయిల్ జంక్షన్ చేరుకుంటుంది.
వివేక్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరే టైమ్ ఎంత?
దిబ్రూగర్ నుండి డైలీ రాత్రి 7.40 గంటలకు బయలుదేరే వివేక్ ఎక్స్‌ప్రెస్ 74 గంటల తర్వాత రాత్రి 9.55 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. ఇదే విధంగా కన్యాకుమారి నుండి డైలీ సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరే వివేక్ ఎక్స్‌ప్రెస్ 75.25 గంటల తర్వాత రాత్రి 9 గంటలకు దిబ్రూగర్ చేరుకుంటుంది.