చిత్తూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అమ్మాయి కుటుంబసభ్యులే హత్య చేశారని భర్త బంధువులు ఆరోపిస్తున్నారు.
తిరుపతి:చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్య చోటు చేసుకొంది. పెళ్ళై పారాణి ఆరకముందే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఇంటి సమీపంలో మృతదేహాన్ని యువతి తల్లిదండ్రులు దహనం చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకొందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు హత్య జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లో ఊసర పెంటలో జరిగిన పరువు హత్య ఘటన మరువకముందే సమీప గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రెడ్ల పల్లి గ్రామంలో "బిసి" కులానికి చెందిన చందన వడ్డుమడి గ్రామానికి చెందిన నందకుమార్ లు ప్రేమించుకున్నారు.
undefined
రెండు రోజుల క్రితం ఇరువురూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళి యువతి కుటుంబీకులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఘర్షణలు జరిగాయి. గ్రామ పెద్దల ద్వారా యువతిని ఇంటికి పిలిపించారు. శనివారం రాత్రి పుట్టింటికి వచ్చిన చందన తెల్లారకముందే శవమైంది. చందనను తల్లిదండ్రులు రాత్రికి రాత్రి ఆమెను హత్య చేసి దహనం చేసేశారని ఆరోపిస్తున్నారు యువకుడి కుటుంబీకులు.
కానీ యువతి తల్లితండ్రులు మాత్రం చందన ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెబుతున్నారు. శాంతిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దహనం చేసిన తీరు ప్రదేశాన్ని డిఎస్పీ పరిశీలిస్తున్నారు.
ఈ ఘటన ముమ్మాటికీ పరువు మాటున జరిగిన దురహంకార హత్యేనని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.