
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు మరో ఉద్యమం చేసే పరిస్థితి కనిపిస్తోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగ అవకాశాలకు, రక్షణకు జోనల్ వ్యవస్థ ను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అయితే స్వరాష్ట్రంలో ఇక జోనల్ వ్యవస్థతో పనేముందని సర్కారు భావిస్తోంది. అంతేకాదు దీనికి కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా మద్దతిస్తున్నాయి.దీంతో త్వరలోనే జోనల్ వ్యవస్థ రద్దుకు రాష్ట్రపతికి సిఫారసు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని నిరుద్యోగులు, ఉద్యమ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
తెలంగాణలో జోనల్ వ్యవస్థ ఉంటేనే అవకాశాలపరంగా సమానత ఉంటుందని జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. అలాగే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా జోనల్ వ్యవస్థ ను కొనసాగించాలని కోరుతున్నారు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నేతలు కూడా జోనల్ కొనసాగింపునకే మద్దతు తెలుపుతున్నారు.
దీనిపై అందరి అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్లాల్సిన సర్కారు మాత్రం జోనల్ రద్దు కోసం చాలా తొందరపడుతోంది.
జోనల్ రద్దు పేరుతో ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చుపెట్టేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఎందుకంటే కేవలం గ్రూప్ 1 అధికారుల సంఘాల నేతలు మాత్రమే జోనల్ రద్దు కు మద్దతిస్తున్నారు. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలు, నిరుద్యోగుల, మేధావులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
‘1973 ముందు ఉన్న ముల్కి నిబంధనలను రద్దు చేసి 371(డి) ఆర్డినెన్స్‌తో స్థానికులకు ఉద్యోగాలు దక్కా లనే ఆలోచనతో రాష్ట్రపతికి అధికారం ఇచ్చారు. దీంతో ఎక్కడి ప్రాంతాల వారికి అక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దీని వల్ల వెనకబడిన తెలంగాణ ప్రాంతంలో కూడా కాస్తో కూస్తో ఉద్యోగాలొచ్చాయి.
ఇప్పుడు జోనల్ రద్దు చేస్తే రాష్ట్రంలో విద్యాపరంగా బాగా అభివృద్ది చెందిన ప్రాంతాలే ఉద్యోగాలన్నీ ఎగురేసుకపోతాయి అనేది చాలా మంది అభిప్రాయం.స్థానికులకు ఉపాధి అవకాశాలు రావాలంటే ఏదో రూపంలో స్థానిక రిజర్వేషన్‌లు అవసరం మనేది మేధావుల వాదన. అందుకు జోనల్ కొనసాగింపే ఏకైక మార్గంగా కనిపిస్తోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోనల్ వ్యవస్థ కొనసాగిస్తూ ఆ ప్రకారమే నియామకాలు కొనసాగిస్తుంటే తెలంగాణ లో మాత్రం నోటిఫికేషన్లకు జోనల్ రద్దుకు లింక్ పెట్టి కాలయాపన చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.