అంత చేస్తే దోషిగా ఎఫ్ఐఆర్‌లో పేరు.. వైఎస్ బతికుంటే కాంగ్రెస్‌పై ఉమ్మేసేవారు : షర్మిల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 29, 2022, 7:17 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ చనిపోతే దోషి అని కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయించిందని... వైఎస్ బతికి వుంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అలాంటి వైఎస్సార్ చనిపోతే దోషి అని కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయించిందని షర్మిల వ్యాఖ్యానించారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతే కనీసం దర్యాప్తు చేయించలేదని.. అంత గొప్ప నాయకుడిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు. 

బతికున్నప్పుడు ఇంద్రుడు, చంద్రుడు అని వైఎస్సార్‌ను పొగిడారని.. చనిపోయాక పొగడకపోయినా పర్వాలేదు కానీ.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అవమానపరిచారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలని... ఇప్పుడు వైఎస్సార్ ఫోటో పెట్టుకుని ఓట్లు ఎలా అడుగుతుందని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని.. ఇప్పుడు వైఎస్ బతికి వుంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఖ్యాతిని తెచ్చారు కానీ.. వైఎస్సార్‌కి కాంగ్రెస్ ఖ్యాతి తేలేదని షర్మిల అన్నారు. 

ఇకపోతే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనపై చేసిన వ్యాఖ్యలకు గాను ఇటీవల జగ్గారెడ్డికి కౌంటరిచ్చారు షర్మిల. తనకు వార్నింగ్ ఇవ్వడానికి జగ్గారెడ్డి ఎవరు అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి చనిపోయినప్పుడు.. మేం రాజకీయాలు చేశామని జగ్గారెడ్డి అన్నారని, తాము ఎంత బాధపడ్డామో ఆయనకేం తెలుసు అని షర్మిల నిలదీశారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలంతా తనపై ఫిర్యాదు చేసినా భయపడలేదన్నారు. తనను ఓ మంత్రి మంగళవారం మరదలు అన్నారని.. ఎవడ్రా నువ్వు అన్నందుకు తనపైనే కేసు పెట్టారని షర్మిల తెలిపారు.

Also Read:మా నాన్న చనిపోతే రాజకీయాలు చేశామా... ఎంత బాధపడ్డామో నీకు తెలుసా : జగ్గారెడ్డికి షర్మిల కౌంటర్

అంతకుముందు మంగళవారం నాడు హైద్రాబాద్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులు ఎందుకు మూడు రాష్ట్రాలు చేయాలని ఆయన ఏపీ సీఎం జగన్ కు సలహ ఇచ్చారు. అమరావతి, కడప, విశాఖలను రాజధానులుగా చేసుకుని పాలన చేయాలని జగ్గారెడ్డి సూచించారు. మూడు రాష్ట్రాలకు మీ కుటుంబంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కావచ్చన్నారు.  మీ ఇంట్లో వాళ్లే సీఎంలుగా ఉండాలా అని జగ్గారెడ్డి  షర్మిలను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల ఎందుకు పాదయాత్ర చేయడం లేదో చెప్పాలన్నారు.  

తెలంగాణలో  కాంగ్రెస్, లెఫ్ట్ , బీజేపీ, ఎంఐఎం లున్నాయని.... ఇన్ని పార్టీలతో షర్మిల పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఏపీలో మాత్రం ఇంత పోటీ ఉండదని జగ్గారెడ్డి చెప్పారు. మీ కుటుంబంలో పంచాయితీని రాష్ట్రాల మధ్య పంచాయతీగా మార్చొద్దని కూడా విజయమ్మకు జగ్గారెడ్డి సలహ ఇచ్చారు. షర్మిల ఏం చేసినా తెలంగాణలో నాయకురాలు కాలేదన్నారు. షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తనను కోవర్ట్ అన్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోవర్ట్ అని తనను విమర్శించడం తనకు ఓ శాపమని అనుకొంటున్నానన్నారు. 
 

click me!