మునుగోడు ఉప ఎన్నికకు ఈసీ కసరత్తు.. నవంబర్ రెండో వారంలో పోలింగ్..?

Published : Sep 29, 2022, 05:27 PM IST
మునుగోడు ఉప ఎన్నికకు ఈసీ కసరత్తు.. నవంబర్ రెండో వారంలో పోలింగ్..?

సారాంశం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకపోయినప్పటికీ.. ఈ ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకపోయినప్పటికీ.. ఈ ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ రెండో వారంలో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మునుగోడు ఉప ఎన్నికను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.

ఆగస్టు 8వ తేదీన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అదే రోజు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఇక, నిబంధనల ప్రకారం.. ఆరు నెలలు అంటే ఫిబ్రవరి 8వ తేదీలోపు మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే నవంబర్‌లోనే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. 

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వివరాలను తెప్పించుకుందని సమాచారం. అలాగే.. రాష్ట్ర ఎన్నికల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించిందని, ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని కూడా సిద్దంగా ఉంచుకోవాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే .ఉప ఎన్నికకు సన్నాహాలు ప్రారంభించాలని తెలంగాణ ఎన్నికల అధికారులు నల్గొండ కలెక్టర్‌ను ఆదేశించారని సమాచారం. 

ఇక, అక్టోబర్ మొదటి వారంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక, నవంబర్ రెండో వారంలో మునుగోడు ఉప పోలింగ్ జరిగే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu
Hyderabad Police Commissioner VC Sajjanar Celebrate New Year at Charminar HYD | Asianet News Telugu