పోలవరంపై నాలుగు రాష్ట్రాలతో ముగిసిన కేంద్ర జల‌్‌శక్తి శాఖ భేటీ... ఏం తేల్చారంటే..?

By Siva KodatiFirst Published Sep 29, 2022, 5:08 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్ట్‌పై నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌పై కేంద్రం అధ్యయనం చేస్తోన్న సంగతి తెలిసిందే. 2019, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్‌పై సర్వేలు జరిగాయని కేంద్రం చెబుతోంది. ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు లేదని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో అడుగులో మూడో వంతు ముంపు ప్రభావం కూడా వుండదని కేంద్రం చెప్పింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా .. ఒడిషా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7న సాంకేతిక నిపుణులతో కేంద్ర జలశక్తి శాఖ మరోసారి భేటీ కానుంది. 

ఇకపోతే.. పోలవరం బ్యాక్ వాటర్ పై మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో డిమాండ్ చేసింది. బ్యాక్ వాటర్ కారణంగా భద్రచాలం సహా పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలంగాణ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో గోదావరి వరదను కూడా తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ముంపు నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ కోరింది. అలాగే రక్షణ కోసం నిర్మించే గోడలకు అయ్యే ఖర్చును పోలవరం అథారిటీ భరించాలని తెలంగాణ కోరింది. 

ALso REad:పోలవరంపై నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ భేటీ: తెలంగాణ వాదన ఇదీ..

కాగా.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలని ఈ నెల 22వ తేదీన తెలంగాణ ఇరిగేషన్ ప్రత్యేక సెక్రటరీ రజత్ కుమార్ కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జ్ కెపాసిటీని 30 లక్షల నుండి 50 లక్షలకు పెంచడంతో తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లనుందని తెలంగాణ అభ్యంతరం చెబుతుంది. బ్యాక్ వాటర్ పై  సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్  సీఈలతో  అధ్యయనం చేయించాలని టీ . సర్కార్ కోరుతోంది. నిజానికి ఈనెల 14 వ తేదీనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమయం ఇవ్వకుండానే ఈ మీటింగ్ ఏర్పాటుపై ఒడిశా అభ్యంతరం తెలపడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. 
 

click me!