వ్యూహాత్మకంగా షర్మిల.. ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో కీలక భేటీ, ఇక పీకే కనుసన్నల్లోనే అడుగులు

By Siva KodatiFirst Published Sep 29, 2021, 8:44 PM IST
Highlights

రాజకీయాల్లో రాణించేందుకు.. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ సలహాలు తీసుకోవాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె పీకే టీమ్‌తో సమావేశమయ్యారు. పాదయాత్రకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ అంశాలపై షర్మిల వారితో చర్చించినట్టు సమాచారం

తెలంగాణ రాజకీయలో శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల.. ఇందుకోసం సొంతంగా వైఎస్ఆర్‌టీపీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. కొన్ని నెలలుగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో నిరుద్యోగ దీక్షలు చేపడుతున్న వైఎస్ షర్మిల.. అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే చేవేళ్ల నుంచి ఈ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ పాదయాత్రతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి ? ప్రజా సమస్యలపై ఏ రకంగా పోరాడాలి ? ప్రజల దృష్టిని తమ వైపు ఎలా తిప్పుకోవాలి ? అనే అంశంపై వైఎస్ షర్మిల దృష్టి పెట్టారు. రాజకీయాల్లో రాణించేందుకు.. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ సలహాలు తీసుకోవాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె పీకే టీమ్‌తో సమావేశమయ్యారు. పాదయాత్రకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ అంశాలపై షర్మిల వారితో చర్చించినట్టు సమాచారం. వీరితో చర్చల అనంతరం మరోసారి ఆమె స్వయంగా ప్రశాంత్ కిశోర్‌తో చర్చించే అవకాశం ఉందని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చర్చలను బట్టి తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ టీమ్ వైఎస్ షర్మిల పార్టీ కోసం పని చేయబోతున్నట్టు స్పష్టత వచ్చినట్టే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తులగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని వైఎస్ షర్మిల కొత్త పార్టీ నిలబడుతుందా ? అనే సందేహాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి షర్మిల పార్టీ కోసం పని చేస్తే.. వైఎస్ఆర్‌టీపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

click me!