
గోదావరి వరదల వెనుక విదేశాల కుట్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేసీఆర్ మాటలు పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. అయితే తాజాగా కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కామెంట్స్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ట్విట్టర్‌లో కేసీఆర్ మాటలకు సంబంధించిన కొన్ని పేపర్ క్లిపింగ్స్‌ను షేర్ చేసిన వైఎస్ షర్మిల.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘ఆంధ్రోళ్ల అణిచివేతలైపోయినయ్.. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్.. తిరుగుబాటుదారుల వెన్నుపోటులు అయిపోయినయ్.. జాతీయ పార్టీల జిమ్మిక్కులు అయిపోయినయ్.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది. ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్. ఒక్క వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్ మన KCR దొర గారికి’’ అని వైఎస్ షర్మిల సెటైరికల్‌గా ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆదివారం ఉదయం రోడ్డుమార్గంలో హన్మకొండ నుంచి బయలుదేరిన కేసీఆర్.. మధ్యాహ్నం భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో గోదావరి నదికి శాంతి పూజలు చేశారు. సహాయక శిబిరాల్లో ఉన్న నిర్వాసితులను పరామర్శించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. శిబిరాల్లో ఉన్న వారికి ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేలు అందజేస్తామని ప్రకటించారు.
గోదావరి వరదలు క్లౌడ్ బరస్ట్ అని.. దీని వెనక విదేశీ కుట్రలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. “మన దేశంలో క్లౌడ్ బరస్ట్‌ల వెనుక ఇతర దేశాల హస్తం ఉందని ధృవీకరించబడని నివేదికలు ఉన్నాయి. ఈ కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లేహ్ లడఖ్‌లో, తర్వాత ఉత్తరాఖండ్‌లో, ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఉంది’’ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన కడెం డ్యామ్ వరదలను అద్భుతంగా తట్టుకుని నిలిచిందని కేసీఆర్ అన్నారు. “డ్యామ్ మనుగడ సాగించడం దేవుడు చేసిన అద్భుతం. దీని గరిష్ట సామర్థ్యం దాదాపు 2.90 లక్షల క్యూసెక్కులు. అయితే ఈ వరద సమయంలో అది 5 లక్షల క్యూసెక్కులకు చేరి ఇప్పటికీ నిలవడం ఒక అద్భుతం. భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని కేసీఆర్ చెప్పారు.