సమస్యలంటే ఒక్కరూ రారు.. నా మీద ఫిర్యాదుకు అంతా ఒక్కటయ్యారా : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై షర్మిల ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 15, 2022, 5:48 PM IST
Highlights

తనపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఎమ్మెల్యేలంతా ఒక్కటయ్యారని .. మరి ఈ జిల్లా సమస్యల కోసం ఎప్పుడైనా ఒక్కటయ్యారా అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రశ్నించలేదని ఆమె ఎద్దేవా చేశారు. 

పాలమూరు నీళ్ల పోరు దీక్ష విరమించారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రశ్నించలేదని షర్మిల ఎద్దేవా చేశారు. అధికార పార్టీకి అమ్ముడు పోవడం వల్లే వేల కోట్లు సంపాదించారని ఆమె ఆరోపించారు. తనపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఎమ్మెల్యేలంతా ఒక్కటయ్యారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ జిల్లా సమస్యల కోసం ఎప్పుడైనా ఒక్కటయ్యారా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఇక్కడి నుంచి వెళ్లగొడుతున్నారని.. అందుకే దేశం మీద పడుతున్నారని షర్మిల చురకలు వేశారు. బీజేపీ మత పిచ్చి పార్టీ అని .. చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. 

అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి  తనపై చర్యలు తీసుకొంటే న్యాయపరంగా ముందుకు వెళ్తానని వైఎస్ షర్మిల చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర శిబిరం వద్ద ఆమె తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. 

ALso REad:మరదలంటే తప్పు లేదు.. నేను ‘ఎవడ్రా’ అంటే తప్పొచ్చిందా : నిరంజన్ రెడ్డిపై షర్మిల ఆగ్రహం

ప్రజలు చర్చించుకుంటున్న అంశాలతో పాటు జర్నలిస్టుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా తాను పాదయాత్ర సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులపై విమర్శలు చేసినట్టుగా షర్మిల వివరించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తన పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులపై తాను చేసిన విమర్శల్లో అవాస్తవాలు లేవన్నారు. ప్రజలు చర్చించుకుంటున్న అంశాలనే తాను ప్రస్తావించానన్నారు. ప్రజలు చర్చించుకుంటున్నఅంశాలకు ఆధారాలు ఉండవని షర్మిల పేర్కొన్నారు. 

రాష్ట్రంలో చోటు చేసుకున్న విషయాలపై మాట్లాడేందుకు ప్రజలు భయపడుతున్నారన్నారు. ప్రజలే కాదు జర్నలిస్టులు కూడా ఈ విషయమై మాట్లాడేందుకు జంకుతున్నారని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగాలు తీయించి వేస్తారని, కేసులు పెడతారనే భయం ఉందన్నారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతి గురించి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించేసరికి కోపం వస్తుందా అని టీఆర్ఎస్ నేతలపై చురకలు వేశారు. నిజాలు మాట్లాడడం తప్పా.. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు. 

click me!