కేసీఆర్ చేసి చూపారు.. మీరూ ఆచరించండి : ‘‘అంబేద్కర్’’ విషయంగా బీజేపీకి తలసాని చురకలు

By Siva KodatiFirst Published Sep 15, 2022, 4:17 PM IST
Highlights

బీజేపీ నేతలు మాటలు కట్టిపెట్టి.. ఆచరణలో చూపాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ కొత్త సచివాలయం దేశానికే ల్యాండ్ మార్క్‌గా నిలుస్తుందని.. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద, బడుగు , బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని తలసాని ప్రశంసించారు. యావత్ జాతి మొత్తం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తుందన్నారు. 75 ఏళ్లు గడుస్తున్నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడుస్తోందన్నారు. ఒకరికి చెప్పే ముందు తానే చేసి చూపించాలన్నది కేసీఆర్ అభిమతమని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని తలసాని గుర్తుచేశారు. తెలంగాణ కొత్త సచివాలయం దేశానికే ల్యాండ్ మార్క్‌గా నిలుస్తుందని.. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాటలు కాదు.. బీజేపీ నేతలు ఆచరణలో చూపాలని తలసాని కౌంటరిచ్చారు. 

ALso REad:కొత్త‌ పార్ల‌మెంట్ భ‌వ‌నానికి బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్

అంతకుముందు నూతనంగా నిర్మిస్తోన్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు కేసీఆర్. అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ ఏర్పాటైందని సీఎం కొనియాడారు. అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికే ఆదర్శమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని.. త్వరలోనే దీనికి సంబంధించి ప్రధానికి లేఖ రాస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. 

click me!