
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సొంత జిల్లాలో సిద్దిపేటలో కూడా రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు, సర్పంచ్ లు ఆత్మహత్యాయత్నాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇటీవల సీఎం కేసీఆర్ సొంతజిల్లా సిద్దిపేట జగదేవ్ పూర్ మండలానికి చెందిన రైతు దబ్బేట మల్లేశం మృతిపై షర్మిల స్పందించారు. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యానికి సిద్దిపేటకు చెందిన ఈ రైతు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లేశం కుటుంబానికి షర్మిల సంఘీభావం ప్రకటించారు.
''తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి, విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసల్ రావు కానీ తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా?'' అని షర్మిల నిలదీసారు.
''పంట దిగుబడి లేక పెట్టుబడి రాక మీరు ఆదుకొంటారనే ఆశ చచ్చి సిద్ధిపేట రైతు మల్లేశం ఆత్మహత్య చేసుకొన్నాడు. 11లక్షల అప్పుతెచ్చి పంచాయితి పనులు చేస్తే చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచ్ ఎల్లయ్య చావనికి ప్రయత్నించిండు. బిల్లులు చెల్లించక సర్పంచ్ ల ను ఇబ్బంది పెట్టింది ఇక చాలు. మీ దేశాన్నేలపోవాలన్న దురదకు తెలగాణ బిడ్డల ముంచకు దొరా'' అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సిద్దిపేట రైతు ఆత్మహత్య:
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం రామవరం గ్రామానికి చెందిన దబ్బెట మల్లేశం (56) కౌలు రైతు. మూడేళ్లుగా ఎకరం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ప్రతి ఏడాది పత్తిని సాగుచేస్తున్న అతడికి దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక ఏదోలా నష్టమే మిగులుతోంది. దీంతో అతడు ఆర్థికంగా నష్టపోయాడు.
మరోవైపు మల్లేశం పెద్దకొడుకు భాస్కర్ అనారోగ్యానికి గురవడంతో హాస్పిటల్ ఖర్చులకోసం భారీగా అప్పులు చేసాడు. ఇలా వ్యవసాయం, కొడుకు చికిత్స కోసం రూ.3లక్షల అప్పులు చేసాడు. అయితే ఇటీవల అప్పులిచ్చిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో మల్లేశం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక చివరకు తన ప్రాణాలు తీసుకున్నాడు.
నాగర్ కర్నూల్ లో సర్పంచ్ ఆత్మహత్య:
గ్రామాభివృద్ది కోసం సొంత డబ్బులు ఖర్చుచేసి సమయానికి బిల్లుల రాక ఓ సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. లింగాల మండలం అవుసలి కుంట గ్రామ సర్పంచ్ ఎల్లయ్య గ్రామాభివృద్దికోసం రూ.11 లక్షలు అప్పులుచేసి మరీ పనులు చేయించాడు. ఇందుకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, అప్పులిచ్చిన వారినుండి ఒత్తిడి పెరగడంతో అతడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయిన అతన్ని కుటుంబసభ్యులు జిల్లా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.