YS Sharmila: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్న వేళ.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల .. అధికార బీఆర్ఎస్ పై, పరోక్షంగా మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్ రావులను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి ఎన్నికల్లో గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. తాము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ములేక మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగలిస్తున్నారని విమర్శించారు.
undefined
రాష్ట్ర ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెడితే... తండ్రీకొడుకులు (కేసీఆర్,కేటీఆర్)రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిరాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు దోచుకున్నారనీ, ఆ ప్రాజెక్టు నిర్మాణాల్లో లోపాలున్నాయని, కుక్క తోక తగిలితే కూలినట్టు కుప్పకూలుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ నిరుద్యోగం పెరిగిపోయిందనీ, ఇప్పటివరకూ సరైన విధంగా నియయాకాలు చేపట్టలేదని మండిపడ్డారు.
తెలంగాణ బిడ్డల జీవితాలను నాశనమవుతున్నాయనీ, వారు ప్రాణాలు కోల్పోయిన పట్టించుకునే నాథులేరని మండి పడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారనీ, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోవడం లేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలే తెలంగాణ ద్రోహులనీ, తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి పనులు చేయలేదని ఆరోపించారు. గడ్డాలు పెంచుకుని దొంగ దీక్షలు చేశారనీ,పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్ట మరిచిపోయినట్టు నాటకాలు ఆడరాని పరోక్షంగా మంత్రి హరీష్ రావు పై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ కుటుంబం ఆస్తులు కోల్పోలేదనీ, వారి ఇంట్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని విమర్శించారు. సంపన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చరనీ, దాదాపు 5 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని చంపేసి, తాలిబాన్ల పాలన చేస్తున్న మిమ్మల్ని తరిమేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు ఆమె తెలిపారు.