చిన్నదొరా... మీరంతా సుద్దపూసలని నిరూపించుకునే దమ్ముందా?: కేటీఆర్ కు షర్మిల సవాల్

Published : Jun 30, 2023, 04:57 PM IST
చిన్నదొరా... మీరంతా సుద్దపూసలని నిరూపించుకునే దమ్ముందా?: కేటీఆర్ కు షర్మిల సవాల్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత అవినీతికి పాల్పడ్డారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఒకరు కాళేశ్వరం పేరుతో, మరొకరు రియల్ ఎస్టేట్ పేరుతో స్కాం చేస్తే కవిత ఏకంగా వేరే రాష్ట్రాల్లో లిక్కర్ స్కాం చేసిందన్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన బిడ్డలు కేటీఆర్, కవిత లపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట లక్ష కోట్ల స్కాం చేయగా ఇద్దరు బిడ్డలూ అదేబాటలో నడిచారని షర్మిల అన్నారు.మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ స్కాం, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం చేసి తండ్రికి తగ్గ బిడ్డలు అనిపించుకున్నారని ఎద్దేవా చేసారు. తన ఆరోపణలు అబద్దమని... మీరంతా సుద్దపూసలని నిరూపించుకునే దమ్ముందా..? అంటూ  కేటీఆర్ కు సవాల్ విసిరారు షర్మిల. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సుపరిపాలనకు, ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలనకు నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందని షర్మిల అన్నారు. వైఎస్సార్ ది ప్రో పూర్, ప్రో ఫార్మర్, ప్రో అగ్రికల్చర్ ఇమేజ్ అయితే కేసీఆర్ ది యాంటి పూర్, యాంటి ఫార్మర్, యాంటి యూత్, యాంటి ఉమెన్, యాంటి మైనారిటీస్ ఇమేజ్ అని అన్నారు. కరప్షన్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కరప్షన్ అని ప్రజలు అనుకుంటున్నారని చిన్నదొర కేటీఆర్ గుర్తించాలన్నారు వైఎస్ షర్మిల. 

తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సమత్యుల అభివృద్ది చెందిందని కేటీఆర్ అంటున్నారని... అయితే ఆయనకు తానొక సవాల్ చేస్తున్నానని షర్మిల అన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా జరిగిన ఒక్క అభివృద్ది పని గురించి చెప్పాలని చాలెంజ్ చేసారు. తండ్రి, చెల్లితో పాటు మీరు కూడా స్కాంలు చేయలేదా? అంటూ కేటీఆర్ కు షర్మిల సవాల్ విసిరారు. 

Read More  గవర్నర్ గురించి వీధిరౌడీలా మాట్లాడతారా... ఆమాత్రం సోయిలేదా..: హరీష్ కు షర్మిల కౌంటర్

ఇదిలావుంటే ఇటీవల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న గవర్నర్ తమిళిసై పై విమర్శలు చేసిన మంత్రి హరీష్ రావుకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడండి... హామీ ఇచ్చినట్లు మంచి ఆసుపత్రి కట్టించండి అని గవర్నర్ ప్రభుత్వాన్ని అడగడమూ  తప్పేనా? అని మంత్రిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రధమ పౌరురాలే కాదు స్వయంగా ఓ డాక్టర్ అయిన తమిళిసై సౌందరరాజన్ ప్రజారోగ్యం గురించి ఆవేదనతో అడిగినా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టేనా హరీష్ రావు గారు? అంటూ నిలదీసారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో వున్న ఓ మహిళ పేదల ఆరోగ్యం కోసం ఆందోళనతో మాట్లాడితే కనీస గౌరవం లేకుండా వీధి రౌడీ కంటే హీనంగా మాట్లాడుతారా..? అంటూ హరీష్ పై షర్మిల మండిపడ్డారు. 

ప్రజారోగ్యం పట్ల సామాన్యులు, వైద్యులే కాదు చివరకు గవర్నర్ ఆందోళన వ్యక్తంచేసినా వారంతా ద్రోహులేనా? ప్రభుత్వ పనితీరుపై నిందలు వేసినట్లేనా? అంటూ షర్మిల ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను మూయించే మీకు చివరకు గవర్నర్ అంటే కూడా లెక్కలేకుండా పోయిందన్నారు. మహిళా గవర్నర్ తమిళిసై అంటే అసలే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని షర్మిల అన్నారు. 

నిజాంల కాలంనాటి భవనంలో కొనసాగుతున్న ఉస్మానియా హాస్పిటల్ ప్రాంగణంలో అద్భుతమైన ట్విన్ టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ 2015 ఇచ్చిన హామీ ఏమయ్యిందని షర్మిల ప్రశ్నించారు. పిట్టల దొర కేసీఅర్ మాటలు గుర్తు తెచ్చుకోండని అన్నారు. టోపీ పెట్టుకొని రెండేళ్లలో కొత్త భవనాలు అంటూ మాటిచ్చిన సంగతి యాది చేసుకోండన్నారు. ఈ అంశం కోర్టులో వుందని అంటున్నారే... మరి హాస్పిటల్ లో మౌళిక సదుపాయాల కల్పించాల్సిన సోయి వైద్యారోగ్య శాఖ మంత్రిగా మీకుండాలి కదా అంటూ హరీష్ పై షర్మిల సీరియస్ అయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే