
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi)పై విరుచుకుపడుతూ జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ (KCR) ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల (ys sharmila) స్పందించారు. ట్విట్టర్ వేదికన రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ కు చురకలు అంటించారు.
''ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టు. రోజుకిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకో. మోడీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ...నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో'' అంటూ షర్మిల కేసీఆర్ ను హెచ్చరించారు.
''మీరు పులి బిడ్డయితే మొన్న మీ మెడమీద లేని కత్తిని చూసి వడ్లు కొననని ఎట్లా రాసిచ్చారు దొరగారు? నిన్నటిదాకా కేంద్రానికి వంతపాడి ఈరోజు ఉడుతఊపుల పంచాయితీ పెట్టినవా? రాష్ట్రంలోని సమస్యలనే పరిష్కరించడం చేతకాని మీరు దేశ రాజకీయాలు చేస్తారా? గాలిలో మేడలు. పగటి కలలు. ఓట్ల కోసం తిప్పలు'' అంటూ సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేస్తూ షర్మిల ట్వీట్ చేసారు.
అంతకుముందు మిర్చి రైతుల ఆత్మహత్యలపై కూడా షర్మిల స్పందించారు. ''మిర్చి పంటకు తామర తెగులు సోకి పంట నష్టపోతే, కాస్తోకూస్తో వస్తుంది అనుకున్న పంట అకాల వర్షాలకు మొత్తం కొట్టుకుపోతే,రాష్ట్రంలో 1.44 లక్షల ఎకరాల్లో ఎకరాకు లక్ష 25 వేల పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోతే, తెచ్చిన అప్పులను తీర్చలేక మిర్చి రైతులు రోజుకు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొంటుంటే తూతూమంత్రంగా పరామర్శించామా, ఒదిలేశామా అన్నట్టే ఉంది రైతులపై KCR గారి ప్రేమ, కానీ నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలనే సోయి లేదు. ఇక మీరు ఆదుకోరని 20 మందికి పైగా మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. మరొక రైతు చనిపోకముందే ఎకరాకు 50 వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం'' అన్నారు.
''మాట ఇస్తే తల నరుక్కొంటాడు తప్పితే మాట తప్పే మనిషి కాదు దొరగారు. 7ఏండ్ల కింద ఆత్మహత్య చేసుకొన్న 133 మంది రైతులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చింది లేదు. తల నరుక్కొన్నది లేదు. 6లక్షలు ఇస్తామని 2015లో ఇచ్చిన GO కాగితాలకే పరిమితమైంది తప్పితే రైతు కుటుంబాలకు మాత్రం ఇప్పటివరకు పరిహారం అందలేదు'' అని షర్మిల మండిపడ్డారు.
''చిన్నదొర గారి సొంత నియోజకవర్గంలో అప్పులపాలైన రైతు ఆత్మహత్య చేసుకుండు. చేనేత మంత్రిగారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పులపాలై చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అయినా మంత్రి కేటీఆర్ గారు ఆదుకోవాల్సింది పోయి గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు చేస్తున్నారు తప్పితే అయ్యో అనడానికి నోరు మెదపటం లేదు. సాయమందించటానికి చెయ్యి రావటం లేదు'' అంటూ షర్మిల ట్వీట్ చేసారు.
''పంట పెట్టుబడికి అప్పు తెచ్చి, సాగు నీటికోసం బోర్ల మీద బోర్లు వేసి చుక్క నీళ్లు పడక, కండ్లనుంచి నీటి ధార ఆగక తెచ్చిన అప్పులు తీర్చలేక గోవర్ధన్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే, చేనేత మగ్గం నడువక, బతుకు బండి బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక చేనేత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం భారమైపోయింది. నేతన్నల కష్టానికి ఫలితం కరువైంది. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోని పెద్ద దొర, చిన్న దొర దేశాన్ని ఏలపోవడానికి తెలంగాణ బిడ్డలను గాలికొదిలేస్తున్నారు'' అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇక భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపైనా ఇదే ట్విట్టర్ వేదికన షర్మిల స్పందించారు. ''భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ మోడీ గారిని కడుగుతా, తోముతా, దేశంలో భూకంపం తెప్పిస్త అన్న దొరగారు... మోడీ హైదరాబాద్ కు వస్తే ఎందుకు కలవలేదు? బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని మోడీకి ఎదురుపడి ఎందుకు అడుగలేదు?'' అని నిలదీసారు.
''బండ బూతులు తిట్టిన నోటితో బాగున్నారా అని అడుగలేక పోయారా? చీరుతా అన్న చేతులతో నమస్కారం పెట్టలేకపోయారా? పోయినుంటే మోడీ, కేసీఆర్ ఢిల్లీ దోస్తానీ మరోసారి బయటపడుతదని పోలేదా? అందుకే జ్వరం వంక పెట్టుకొని డుమ్మా కొట్టారా? సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు పోని పాపాన్ని కడుక్కోవటానికి యాదాద్రి యాగానికి వెళ్ళారా? బాగుంది దొరగారు మీ జ్వర రాజకీయం'' అంటూ షర్మిల ఎద్దేవా చేసారు.