
రాహుల్ గాంధీపై (rahul gandhi) అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (himanta biswa sarma) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) డిమాండ్ చేశారు. దేశానికి మోడీ (narendra modi), బీజేపీ (bjp) అధిష్టానం క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. బీజేపీ దేశాన్ని ఏలుతున్నందుకు సిగ్గుగా ఉందని, ఇదేనా.. బీజేపీ సంస్కృతి అని భట్టి ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు .. దేశ సంస్కృతిపై గౌరవం ఉంటే హిమంత బిశ్వశర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని విక్రమార్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ సంస్కృతికి విరుద్ధంగా బీజేపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనాయకత్వం వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని విక్రమార్క డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానం మెప్పు కోసమే రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం వ్యాఖ్యలు చేశారని భట్టి విమర్శించారు. భవిష్యత్తులో కమలం పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని భట్టి హెచ్చరించారు.
రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ఖండించిన సంగతి తెలిసిందే. ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్‌లో కదలిక వచ్చింది. రాహుల్‌పై అసోం సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హిమంత బిశ్వ శర్మ దిష్టిబొమ్మను దగ్థం చేశాయి. అసోం సీఎంవి దిగజారుడు వ్యాఖ్యలని.. కొన్ని ఓట్ల కోసం చేశారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అసోం సీఎంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇది గాంధీ కుటుంబంపై జరిగిన దాడి కాదని.. దేశ సంస్కృతిపై జరిగిన దాడిగా రేవంత్ (revanth reddy) అభివర్ణించారు. వాస్తవాలను ప్రస్తావిస్తే బీజేపీ నేతలు.. ఏ రకమైన భాష ఉపయోగిస్తారో మనం చూస్తున్నామంటూ ఆయన దుయ్యబట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై నిలదీస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోనేత జగ్గారెడ్డి (jagga reddy) మాట్లాడుతూ.. రాహుల్ కుటుంబం గురించి అడిగే అర్హత అసోం సీఎంకు లేదన్నారు. అసోం సీఎంకు ఎంతమంది తండ్రులని మేం అడగాలా అంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.