మహబూబాబాద్ జిల్లాలో నిరాహారదీక్షకు కూర్చున్న వైఎస్ షర్మిల

By Arun Kumar PFirst Published Aug 17, 2021, 12:50 PM IST
Highlights

ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి ఆ రోజంతా నిరాహాార దీక్ష చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరాహార దీక్షకు దిగారు. 

మహబూబాబాద్: ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ  యువత కుటుంబాలను పరామర్శిస్తున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల. ఇలా కేవలం పరామర్శకే పరిమితం కాకుండా ప్రతి మంగళవారం ఒకరోజు నిరాహారదీక్షకు కూర్చుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరాహార దీక్ష చేపట్టారు షర్మిల.  

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సోమ్లా తండాకు చెందిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ ఇటీవల మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర దు:ఖంలో వున్న సునీల్ తల్లిదడ్రులను షర్మిల పరామర్శించారు. సోమ్లా తండాకు చేరుకున్న షర్మిల నేరుగా సునీల్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. చేతికందివచ్చిన కొడుకును కోల్పోయిన వారికి అండగా వుంటానని షర్మిల భరోసా ఇచ్చారు.   

అనంతరం అక్కడినుండి  నేరుగా గుండెంగ గ్రామంలో ఏర్పాటుచేసిన నిరాహార దీక్షా శిబిరానికి చేరుకున్నారు. తండ్రి వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించిన అనంతరం నిరాహార దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 6గంటల వరకు షర్మిల నిరాహార దీక్ష కొనసాగుతుంది. దీక్ష ముగించిన అనంతరం ఆమె నిరుద్యోగ సమస్యలపై మాట్లాడనున్నారు.

వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షకు వైఎస్ అభిమానులు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద సంఖ్య‌లో హాజరయ్యారు.  

read more  హుజురాబాద్ లో మరింత హీటెక్కిన పాలిటిక్స్... నిరాహార దీక్షకు దిగిన వైఎస్ షర్మిల (వీడియో)

ఇలా ఇప్పటికే నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న షర్మిల పోడు భూముల పరిష్కారం కోసం, పోడు రైతులకు భరోసా ఇవ్వడానికి ఆగస్ట్ 18న అంటే ఈ బుధవారం ములుగు జిల్లాలో "పోడుభూములకై పోరు" కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఉద‌యం 11గంట‌ల‌కు ములుగులోని అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళి అర్పించిన అనంత‌రం ప‌స్రా గ్రామంలోని కుమ్రం భీం విగ్ర‌హానికి కూడా నివాళి అర్పించనున్నారు.

ఈ క్రమంలో షర్మిల ములుగు నుండి లింగాల గ్రామం వ‌ర‌కు భారీ ర్యాలీ చేప‌ట్ట‌నున్నారు. లింగాల‌లో "పోడుభూములకై పోరు" కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వైయ‌స్ఆర్ అభిమానులు, ఆదివాసీ గిరిజ‌నులు పెద్ద సంఖ్య‌లో హాజరుకావాలని వైఎస్సార్ టిపి పిలుపునిచ్చింది. 

 

click me!