హ్యాకింగ్, లీకింగ్, కాపీయింగ్.... కేసీఆర్ పాలనలో టీఎస్ పిఎస్సి నిర్వాకమిదీ: షర్మిల ఎద్దేవా

By Arun Kumar PFirst Published May 30, 2023, 3:49 PM IST
Highlights

టీఎస్ పిఎస్సి పేపర్ల లీక్ వ్యవహారంపై స్పందిస్తూ మరోసారి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్ పిఎస్సి చేపట్టే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ తెలంగాణలో కలకలం సృష్టించింది. ఈ పేపర్ల లీక్ వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సర్వర్లు హ్యాకింగ్... క్వశ్చన్ పేపర్స్ సెల్లింగ్..హైటెక్ మాస్ కాపీయింగ్... ఇదీ తొమ్మిదేండ్లుగా కేసీఆర్ దొర చేతిలో సాగిన టీఎస్ పిఎస్సి బోర్డు నిర్వాకం అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. 

ఓవైపు పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి... మరోవైపు పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, మైక్రో చిప్స్, ఇయర్ బర్డ్స్ తీసుకెళ్లి కాపీయింగ్ చేస్తున్నారని షర్మిల అన్నారు. ఇంత జరుగుతుంటే కేసీఆర్ పోలీసులు ఏం చేస్తున్నట్లు? 24 గంటల నిఘా వ్యవస్థ నిద్రపోయిందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల ప్రమేయం లేనిదే ఇది సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారీగా ప్రభుత్వోద్యోగాల నియామకాలు వుంటాయని నిరుద్యోగ యువత భావించారని షర్మిల అన్నారు. ఇందుకోసమే ఇళ్లకు దూరమై తల్లిదండ్రులను వదిలి పట్టుదలతో చదువుతూ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే తమ జీవితాలు మారిపోతాయని లక్షలాది మంది నిరుపేద యువత అప్పులు చేసి మరీ చదువుకుంటున్నారని అన్నారు. ఇలా ఏండ్ల తరబడి సిన్సియర్ గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే వాళ్లకు మీరిచ్చే బహుమానం ఇదేనా? అంటూ షర్మిల మండిపడ్డారు. 

Read More  తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఛాంబర్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత..

పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఇయర్ బర్డ్స్ తో వెళ్లిన కొందరు అభ్యర్థులు బయట చాట్ జీపీటీ సాయంతో సమాధానాలు చేరవేస్తుంటూ దర్జాగా రాసారన్నారు. ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సిన పోటీ పరీక్షలను ఇలా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్, టీఎస్ పిఎస్సి బోర్డు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. టీఎస్ పిఎస్సి లో ఉద్యోగాల భర్తీపేరిట జరుగుతున్న అవినీతికి ఐటీ శాఖ అసమర్ధతే కారణమని... ఇందుకు బాధ్యతగా ఆ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.  

టీఎస్ పిఎస్సి బోర్డు అవినీతి, అక్రమాలు గ్రామాలకు పాకి ఖండాలు దాటినా చర్యలు లేవంటూ ఆందోళన వ్యక్తం చేసారు. మళ్లీ దొంగ చేతికే తాళాలు ఇచ్చారని...పాత బోర్డుతోనే కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్డని అన్నారు. సిట్ అధికారులకు గడీ బయట ఉన్న దొంగలు దొరుకుతున్నారు కానీ గడీ లోపల ఉన్న అసలు దొంగలు దొరకడం లేదా? అని అడిగారు. నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించాలని... విచక్షణ అధికారాలు ఉపయోగించి టీఎస్ పిఎస్సి బోర్డ్ రద్దుకు రాష్ట్రపతికి సిఫారసు చేయాలని వైఎస్ షర్మిల కోరారు. 

click me!