తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఛాంబర్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published May 30, 2023, 1:06 PM IST
Highlights

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తా చాంబర్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి.  దీంతో అక్కడ భారీగా  పోలీసులు మోహరించారు. 

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తా చాంబర్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి.  దీంతో అక్కడ భారీగా  పోలీసులు మోహరించారు. వివరాలు.. తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్  నియామకం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు వర్సిటీలో ఆందోళనకు దిగాయి. నేరుగా వర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసనకు దిగారు. పీడీఎస్‎యూ, ఎన్ఐఎస్‎యూ విద్యార్థి సంఘాల నేతలు అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు.

వీసీ ఛాంబర్‌లోకి వెళ్లిన విద్యార్థి సంఘం నేతల్లో కొందరు టేబుల్ పైకి ఎక్కి నిరసనకు దిగారు. వైస్ ఛాన్సలర్ వల్లే తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. 

ఇక, తెలంగాణ విశ్వవిద్యాలయంలో కుర్చీ పోరు సాగుతుంది. వర్సిటీ రిజిస్ట్రార్‌ నియామకంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. రిజిస్ట్రార్‌  పదవిపై ప్రొఫెసర్ యాదగిరి, ప్రొఫెసర్ కనకయ్యల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రిజిస్ట్రార్‌ను నేనంటే.. నేను.. అంటూ వాదిస్తున్నారు. వైఎస్ చాన్సలర్.. కనకయ్యను రిజిస్ట్రార్‌గా నియమించగా పాలకమండలి అంగీకరించడం లేదు. మరోవైపు పాలకమండలి.. యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించగా వైఎస్ చాన్సలర్ అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే వర్సిటీ ఉద్యోగులు రెండు వర్గాలుగా చిలీపోయారు. వైఎస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌  చాంబర్‌లకు తాళాలు వేశారు. వర్సిటీ రిజిస్ట్రర్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. రిజిస్ట్రార్‌  ఎవరో తేల్చాలని వర్సిటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

click me!