
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి అని, ఆయన నిరంతరం ప్రజల కోసమే పని చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సంక్షేమం, అభివృద్ధిని తన రెండు కళ్లుగా భావించారని చెప్పారు. ఉమ్మడి ఏపీని దేశం గుర్తించేలా చేశారని తెలిపారు. వైఎస్ఆర్ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారని, ఈ విషయంలో ఎప్పుడూ ఆయనను మర్చిపోలేరని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పంజాగుట్టలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అన్నకు ఇబ్బంది రావొద్దనే తెలంగాణలో షర్మిల పార్టీ:వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో విజయమ్మ
ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నారని, వైఎస్ఆర్ బతికి ఉంటే వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేవారని తెలిపారు. ఆయన ఉమ్మడి ఏపీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించారని కొనియాడారు. దేశంలోనే ఉమ్మడి ఏపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. అందుకే ఆయన ప్రజల గుండెల్లో నిరంతరం బతికే ఉంటారని చెప్పారు. ఆయన ఆలోచనలు అందరూ కొనసాగించాలని తెలిపారు. ఈ బాధ్యత ప్రజలందరికీ ఉందని తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమం గురించే ఆలోచించారని తెలిపారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. వైఎస్ఆర్ దేశానికి అభివృద్ధి అంటే ఏంటో చూపించారని కొనియాడారు. అలాంటి నేత అందరి మధ్య లేకపోవడం విచారకరం అని అన్నారు. వైఎస్ఆర్ మంచి సమాజ నిర్మాణం కోసం మంచి పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన బాటలో ప్రతీ ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని తెలిపారు.