
Telangana-TRS protest: దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు నిరంతరం పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. విఫలమైన ఆర్థిక విధానాలతో ప్రధాని మోడీ సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని ఆయన అన్నారు. ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలను ఎత్తిచూపుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శ్రేణులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతున్నారంటూ ప్రధాని మోడీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ధరల పెరుగుదలపై కేంద్రంపై ప్రశ్నలు గుప్పించాయి.
ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అసమర్థ పాలనతో ప్రజలపై మరింతగా ఆర్థిక భారం పెరుగుతున్నదని పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో వంటగ్యాస్ ధరలు 170% పెగాయని పేర్కొన్నారు. అత్యంత ఖరీదైన గ్యాస్‌ను విక్రయించి ప్రపంచ రికార్డు సృష్టించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ''ఇటీవల పెరిగిన రూ. 50తో పాటు ఒక్క ఏడాది కాలంలో దేశంలో ఒక్క సిలిండర్ పై రూ.244 రూపాయలు పెరిగిందని'' ట్వీట్ చేశారు. "2014లో కేంద్రంలో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర కేవలం రూ. 410. ఇప్పుడు అది మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఒక్క సిలిండర్ ధర రూ. 1100. ఇది చాలా దురదృష్టకరం. ఇది దేశంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోంది" అని కేటీఆర్ అన్నారు. ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించకుండా ధరేంద్ర (ఖరీదైన) మోడీ ప్రభుత్వం దేశ పౌరులపై మౌనంగా దాడి చేస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
కేంద్రప్రభుత్వం కొత్త ఉద్యోగాల కల్పనకు బదులు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని, దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని, దీంతో సామాన్యులు బతకడం కష్టతరంగా మారిందని కేటీఆర్ అన్నారు. ఈ ధరల పెంపు అంశంపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ నేతలు అధికారంలోకి రాకముందు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు తెలిపారని, కానీ ఇప్పుడు వారంతా మౌనంగా కూర్చున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేని కష్టకాలంలో దేశం నడుస్తోందని కేటీఆర్ అన్నారు. గ్యాస్ ధరల పెంపునకు అంతర్జాతీయ కారణాలను చూపుతూ తన అసమర్ధతను దాచుకోవాలనుకుంటున్న మోడీ సర్కార్ కపటత్వాన్ని దేశ ప్రజలు గుర్తిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అందించిన గ్యాస్ సిలిండర్లను ఉపయోగించకుండా కలపను ఉపయోగించడం వంటి పాత పద్ధతులను ఇప్పుడు ప్రజలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ పథకం మోడీ మరో ఝుమ్లా (స్కామ్) తప్ప మరొకటి కాదని విమర్శించారు.
ఎన్నికల వేళ ధరలు తగ్గిస్తామంటూ డ్రామాలు ఆడవద్దని, ప్రజల సంక్షేమం కోసం గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ఖాలీ సిలిండర్లతో నిరసనలు తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.