చంచల్ గూడ్ జైల్లో వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత... సిబిఐ విచారణ ముందు హైబిపి

By Arun Kumar PFirst Published Apr 19, 2023, 12:04 PM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో వైఎస్ కుటుంబానికే చెందిన భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో వున్న ఆయన సిబిఐ విచారణకు ముందు అస్వస్థతకు గురయ్యారు. 

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి స్వల్ప  అస్వస్ధతకు గురయ్యారు. పులివెందులలో అరెస్ట్ చేసిన భాస్కర్ రెడ్డి హైదరాబాద్ కు తరలించిన సిబిఐ అధికారులు కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఇవాళ భాస్కర్ రెడ్డిని విచారించేందుకు సిబిఐకి కోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో సిబిఐ విచారణపై సందిగ్ధత నెలకొంది. 

జైల్లో వున్న భాస్కర్ రెడ్డి బిపి(బ్లడ్ ప్రెషర్) పెరిగినట్లు సమాచారం. ఆయన బిపి 170కి చేరుకోవడంతో జైలు అధికారులు ఉస్మానియా వైద్యులను పిలిపించి వైద్యం అందిస్తున్నారు. భాస్కర్ రెడ్డికి  సెలైన్ ఎక్కించడంతో పాటు మెడిసిన్స్ ఇచ్చి బిపిని కంట్రోల్ చేయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వివిధ వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.  

వివేకా హత్య కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ ను నేడు సిబిఐ విచారించాల్సి వుంది. ఈ సమయంలో భాస్కర్ రెడ్డి అస్వస్థతతో సిబిఐ విచారణపై సందిగ్దత నెలకొంది. ప్రస్తుతానికి కేవలం ఉదయ్ కుమార్ ను మాత్రమే సిబిఐ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం కుదుటపడ్డాక భాస్కర్ రెడ్డిని విచారించే అవకాశాలున్నాయి. 

Read More దస్తగిరికి ఫుల్ పబ్లిసిటీ , పథకం ప్రకారమే అరెస్ట్‌లు.. చంద్రబాబు కనుసన్నల్లోనే దర్యాప్తు : సజ్జల

ఇదిలావుంటే కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ(బుధవారం)  సీబీఐ విచారణకు  హాజరయ్యారు. సిబిఐ విచారణ, తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ నేపథ్యంలో గత రెండుమూడు రోజులుగా అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోనే వుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లోని నివాసం నుండి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి చేరుకున్న ఆయన విచారణకు హాజరయ్యారు. 

వాస్తవానికి ఈ నెల  17నే అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు  హాజరు కావాల్సి ఉంది. కానీ సిబిఐ అరెస్టుకు ముందే బెయిల్ పొందడానికి ఆయన తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇదేరోజు మధ్యాహ్నం వరకు విచారణ సాగింది. దీంతో మధ్యాహ్నం  3 గంటలకు  సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ ను విచారించకుండానే తర్వాతి రోజు రావాల్సిందిగా సిబిఐ నోటీసులు జారీచేసింది. కానీ 18న కూడా హైకోర్టులో విచారణ వుండటంతో ఇవాళ(బుధవారం) హాజరుకావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు.

ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సిబిఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రతిరోజూ సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అవినాష్ ను ఆదేశించింది. అవినాష్ విచారణ వీడియోను ఆడియోతో సహా రికార్డ్ చేయాలని సిబిఐని ఆదేశించింది కోర్టు. ఈ నెల 25 మరోసారి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.


 

click me!