రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ విజయమ్మ విమర్శలు చేశారు. ప్రశ్నించేవారిని ప్రభుత్వం అణచివేస్తుందని ఆమె మండిపడ్డారు. చంచల్ గూడ జైల్లో వైఎస్ షర్మిలను విజయమ్మ పరామర్శించారు.
హైదరాబాద్: ప్రశ్నించేవారిని ఎంతకాలం అణచివేస్తారని వైఎస్ విజయమ్మ కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నించారు. సోమవారంనాడు చంచల్ గూడ జైలులో వైఎస్ షర్మిలను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలను ప్రశ్నించడమే తప్పా అని వైఎస్ విజయమ్మ అడిగారు. నిన్న సిట్ కార్యాలయం వద్దకు వెళ్లే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఇంటి నుండి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిట్ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నిస్తే ఏమౌతుందన్నారు. షర్మిల నిన్న సిట్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆమెతో పాటు కనీసం 10 మంది కూడా లేరని వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. షర్మిలకు బెయిల్ వస్తుందని అనుకుంటున్నానని ఆమె చెప్పారు.
also read:చంచల్ గూడ జైలుకు వైఎస్ విజయమ్మ: వైఎస్ షర్మిలకు పరామర్శ
వైఎస్ షర్మిలకు బెయిల్ వచ్చే వరకు సంయమనంతో ఉండాలని వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులను కోరారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీక్ తో ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని వైఎస్ విజయమ్మ ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇతర పార్టీల కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు. కానీ షర్మిల కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదన్నారు. కనీసం ఇంటి బయటకు కూడా షర్మిల వెళ్లకూడదా అని విజయమ్మ ప్రశ్నించారు. వాస్తవాలను చూపాలని ఆమె మీడియాను కోరారు.