YS Sharmila Praja Prasthana Yatra: వైఎస్ సింటిమెంట్ తోనే

By telugu teamFirst Published Sep 21, 2021, 8:31 AM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీప్ వైఎస్ షర్మిల అక్టోబర్ 20వ తేదీనుంచి ప్రజా ప్రస్థాన యాత్ర పేరు మీద పాదయాత్రను ప్రారంభించనున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే ఆమె చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.

హైదరాబాద్: తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటును వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాటించనున్నారు. అక్టోబర్ 20వ తేదీన తన ప్రజా ప్రస్థాన యాత్రను ప్రారంభిస్తానని ఆమె సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. తన పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన దారిలో చేవెళ్ల నుంచి ప్రారంభమై, అక్కడే ముగుస్తుందని ఆమె చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దగా పడిన తెలంగాణ ప్రజలకు గుండె ధైర్యం కల్పించడానికే తాను పాదయాత్ర చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు ప్రాంతం తప్ప 90 నియోజకవర్గాల్లో ప్రతి పల్లెను, గడపనూ తాకుతూ ఏడాది పాటు తన పాదయాత్ర సాగుతుందని ఆమె చెప్పారు. 

పాదయాత్ర సమయంలో రోడ్డు పక్కనే తన ఆవాసం ఏర్పాటు చేసుకుంటానని, ప్రజలతో మమేకమవుతానని ఆయన చెప్పారు. ప్రజల కష్టాలనూ కన్నీళ్లనూ తెలుసుకునేందుకు సమయం కేటాయిస్తానని షర్మిల చెప్పారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తామని షర్మిల చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై వైఎస్ షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు. 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి 36 లక్షల మందికి ఎగ్గొట్టారని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 16 లక్షల మంది రైతులు దీనస్థితిలో ఉన్నారని ఆమె అన్నారు. 

కేసీఆర్ పాలనలో దళితులపై 800 శాతం, మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని ఆమె ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్సించారు. 

పాదయాత్రలకు తమ కుటుంబం పెట్టింది పేరు అని ఆమె అన్నారు. వైఎస్ పాదయాత్ర నుంచే ఉచిత విద్యుత్తు, ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు పుట్టాయని, వైఎస్సార్ సంక్షేమ పథకాలను తాను పాదయాత్రలో ప్రజలకు గుర్తు చేస్తానని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చే వరకు పాదయాత్రలో కూడా మంగళవారం దీక్షలు కొనసాగుతాయని షర్మిల చెప్పారు. 

click me!