ప్రశ్నించడమే నచ్చదు.. ఓ మహిళ దీక్ష చేస్తే తట్టుకోగలరా: సీతక్కకు మద్ధతు, కేసీఆర్‌పై షర్మిల విమర్శలు

By Siva KodatiFirst Published Apr 27, 2021, 5:04 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేశారు. దీనిపై స్పందించిన షర్మిల... సీతక్క దీక్షకు సంఘీభావం తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేశారు. దీనిపై స్పందించిన షర్మిల... సీతక్క దీక్షకు సంఘీభావం తెలిపారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న సీతక్కకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం ఆమె దీక్షను భగ్నం చేశారని షర్మిల ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేదని.. అయినప్పటికీ ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారని షర్మిల ప్రశ్నించారు. ఇందుకు సీతక్కను అభినందించడమే కాకుండా, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఆమె ప్రకటించారు.

Also Read:ఎమ్మెల్యే సీతక్క దీక్ష భగ్నం: అరెస్ట్, ఉస్మానియాకు తరలింపు

ప్రశ్నించడమే నచ్చని పెద్దమనిషి కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తుంటే నచ్చుతుందా? అని షర్మిల దుయ్యబట్టారు. ఆ అంశం జీర్ణించుకోలేకనే ప్రశ్నించే గొంతుకలను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు రేపు ఆ మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల జోస్యం చెప్పారు. 

కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ చేపట్టిన దీక్షను మంగళవారం నాడు పోలీసులు  భగ్నం చేశారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను  పోలీసులు  అరెస్ట్ చేశారు.

అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీతక్క అరెస్ట్ చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తులు, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.  ఎమ్మెల్యే సీతక్క ఆరోగ్యం క్షీణించడంతోనే  దీక్షను భగ్నం చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.

click me!